మంత్రివర్గం రేసులో మహిళా నేత.. లక్కు చిక్కేనా ..!
దీనిలో ప్రధానంగా మహిళలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. తద్వారా మహిళా ఓటు బ్యాంకు ను ఆకర్షించాలని చూస్తున్నారు.
బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం చంద్రబాబు... స్థానిక సంస్థలే కాదు తన మంత్రివర్గంలోనూ బీసీలకు పెద్దపీట వేయాలని భావించారు. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఈ దఫా మంత్రులుగా అవకాశం కల్పించాలని ఇప్పటికే సమీక్షలు ప్రారంభించారు. అంతర్గతంగా పార్టీ సేకరించిన రిపోర్టులతో పాటు వ్యక్తిగతంగా చంద్రబాబు ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడు నాయకుల పనితీరును చూసి వేసుకున్న అంచనాలను కూడా ఇప్పుడు సమీక్షిస్తున్నారు. తద్వారా నాయకులను మంత్రులుగా ఎంపిక చేసే విషయంపై దృష్టి పెట్టారు.
దీనిలో ప్రధానంగా మహిళలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. తద్వారా మహిళా ఓటు బ్యాంకు ను ఆకర్షించాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో మెజారిటీ భాగం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, ఆ వర్గం వైపు టిడిపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆవిడే గుంటూరు కు చెందిన గళ్ళ మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన మాధవి ఇటు పార్టీ పరంగా అటు వ్యక్తిగతంగా కూడా దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం విషయంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానీ మాధవి మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఆమెను పార్టీ పొలిట్ బ్యూరోలోకి కూడా తీసుకున్నారు. ప్రధానంగా వైసిపి నేతలపై విరుచుకు పడడంలో ఈ విధంగా కౌంటర్లు ఇవ్వడంలో కూడా మాధవి ముందున్నారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం ఆమె వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. రజక సామాజిక వర్గానికి చెందిన మాధవికి మంత్రివర్గంలో అవకాశం కల్పించే విషయంపై చంద్రబాబు పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయ సమాచారం వైరల్ గా మారింది. మాధవికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలోనూ మంచి పేరు ఉందని సమస్యలపై స్పందిస్తున్నారని సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టడం అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలోనూ మాధవి నిరంతరం కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గంలో మరింత ఇమేజ్ పెంచుకునేందుకు మాధవికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు సీనియర్ నాయకుల మధ్య చర్చ సాగుతోంది. అదేవిధంగా ఈసారి రాయలసీమ నుంచి మరో మహిళను బీసీ సామాజిక కోటాలో మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్ర నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళను కూడా తీసుకుంటారని అంటున్నారు మరి ఏం జరుగుతుందనేది చూడాలి.