జీవీపై పెద్ద బాధ్యత: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ..!
దీనిపై పరిశీలన చేసిన ముఖ్యమంత్రి సోమవారం ఉదయాన్ని ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు తగు సూచనలు చేశారు.;
``దూకుడు మంచిదే అయినా.. సమయం, సందర్భం అత్యంత కీలకం. ఈ రెండు లేకుండా దూకుడు ప్రదర్శిస్తే కష్టమే. ఈ విషయంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి.``-ఇదీ చూచాయగా.. సీఎం చంద్రబాబు తన పార్టీ నాయకులకు తాజాగా చేసిన హితవు. శుక్రవారం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఇక, ఇదేసమయంలో చీఫ్ జీవీ ఆంజనేయులు కూడా సీఎంకు నివేదిక ఇచ్చారు. ఎవరెవరు ఏం మాట్లాడారో వివరించారు.
దీనిపై పరిశీలన చేసిన ముఖ్యమంత్రి సోమవారం ఉదయాన్ని ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు తగు సూచన లు చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీలతో పొత్తు కొనసాగుతుందని.. ఎవరైనా తేడా చేస్తే.. వారే నష్టపోతారని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. మరీముఖ్యంగా కూటమి పార్టీలపై విమర్శలు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా సూచించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతే.. పొత్తులు నిలబడవని.. గతాన్నిగుర్తు పెట్టుకోవాలని కూడా హెచ్చరించారు.
``జనసేన పార్టీ మనకు మద్దతుగా ఉంది. మీరు ఏం చేస్తున్నారు? పార్టీల మధ్య సఖ్యత ముఖ్యం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడితే.. అందరం మునుగుతాం.`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీకి అవకాశం ఇస్తే.. చాలా కష్టమని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. నాయకులు.. కలివిడిగా ఉండకపోయినా.. కనీసం గౌరవప్రదంగా అయినా ఉండాలని సూచించారు. ``నేను అన్నీ గమనిస్తున్నా`` అని చెప్పిన చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా.. ఆ జిల్లాకే పరిమితం అవుతుందన్నారు.
కానీ, అసెంబ్లీలో కూడా టార్గెట్‌లు పెట్టుకుని విమర్శలు చేయడం, వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరితోనూ ఈ విషయాన్ని చెప్పాలని జీవీ ఆంజనేయులుకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, చీఫ్ విప్‌గా మీరు మందలించాలని కూడా ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం నాటి పరిణామాలు.. తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా చంద్రబాబు సూచించారు. ఇక, నుంచి సభలో చర్చలు హుందాగా సాగేలా చూడాలని ఆయనను కోరారు.