ఏఐని ప్రేయసిగా భావించి.. ఉన్నదంతా అమ్ముకున్నాడు.. చివరకు అసలు నిజం తెలిసి షాక్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో పరిచయం.. చాటింగ్‌తో మొదలైన ప్రేమ.. 1,900 కిలోమీటర్ల ప్రయాణం.. ప్రేయసిని కలవాలన్న ఆశతో ఉన్నదంతా అమ్మేసిన వ్యక్తి.. తీరా అక్కడికి వెళ్లాక తెలిసిన అసలు నిజంతో షాక్.. ఆన్లైన్లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించిన బ్రెజిల్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను ప్రేమించిన యువతి నిజమైన వ్యక్తి కాదని.. ఏఐ సాయంతో సృష్టించిన పాత్ర అని తెలిసి అతడు నిర్ఘాంతపోయాడు.
సోషల్ మీడియా పరిచయం.. ప్రేమగా మారిన చాటింగ్..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం.. స్నేహాలు చేయడం.. ప్రేమలో పడటం సాధారణమైపోయింది. అయితే ఆన్లైన్లో కనిపించే ప్రతి వ్యక్తి నిజమైనవారేనా? వారి వెనుక ఉన్నది అసలు మనిషేనా? అనే విషయాలను నిర్ధారించుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియజేసే ఘటన బ్రెజిల్లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
బ్రెజిల్‌కు చెందిన మార్టిన్స్ అనే 49 ఏళ్ల వ్యక్తికి 2020లో జెస్సికా పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా ఖాతా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ ఖాతాలో ఉన్న యువతి ఫొటోను చూసిన అతడు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగడంతో ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తనతో మాట్లాడుతున్నది నిజమైన యువతేనని నమ్మిన మార్టిన్స్.. ఆమెనే తన జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాడు.
1,900 కిలోమీటర్ల దూరం.. ప్రేయసిని కలవాలన్న ఆరాటం..
ఆన్లైన్లో సాగిన పరిచయం.. చాటింగ్‌తోనే ఆగిపోలేదు. తన ప్రేయసిని ప్రత్యక్షంగా కలవాలన్న కోరిక మార్టిన్స్‌లో బలంగా పెరిగింది. ఆమెను చూసేందుకు సుమారు 1,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు కూడా సిద్ధపడ్డాడు. ఇందుకోసం బస్సు ప్రయాణానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవడానికి తన వద్ద ఉన్న వస్తువులను, ఆస్తులను అమ్ముకున్నట్లు సమాచారం.
ప్రేమించిన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆశతో ఇంతటి సాహసానికి సిద్ధపడిన మార్టిన్స్.. తన ప్రయాణం తన జీవితంలోనే అతిపెద్ద నిరాశగా మారుతుందని ఊహించలేకపోయాడు. తాను ఎంతోకాలంగా చాటింగ్ చేస్తున్న యువతిని ప్రత్యక్షంగా చూసి.. ఆమెతో సమయం గడపవచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలతోనే బ్రెజిల్ లోని బెలో హొరిజోంటె నగరానికి చేరుకున్నాడు.
చివరకు తెలిసిన నిజం.. అంతా ఏఐ మాయ..
అయితే అక్కడికి చేరుకున్న తర్వాతే మార్టిన్స్‌కు అసలు విషయం తెలిసింది. తాను ప్రేమించిన జెస్సికా నిజమైన యువతి కాదని, ఓ వ్యక్తి ఏఐ సాయంతో సృష్టించిన క్యారెక్టర్ అని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. తాను ఇన్నాళ్లూ ప్రేమించానని భావించిన వ్యక్తి వాస్తవంగా ఉనికిలోనే లేదన్న విషయం అతడిని తీవ్ర నిరాశకు గురిచేసింది.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తాను ఏఐతో చాట్ చేస్తున్నాననే అనుమానం తనకు ఎప్పుడూ రాలేదని మార్టిన్స్ చెప్పడం. ఆన్లైన్లో జరిగిన సంభాషణలను నిజమైన ప్రేమగా భావించి.. ఆమెను కలుసుకోవడానికి తనకున్నదంతా ఖర్చు చేయడం ఈ ఘటనలో ప్రధానంగా చర్చకు వస్తోంది.
ఏఐ యుగంలో ఆన్లైన్ ప్రేమకు కొత్త సవాళ్లు
కృత్రిమ మేధస్సు సాయంతో మనుషులను పోలిన ఫొటోలు, వీడియోలు, స్వరాలు, సంభాషణలు సృష్టించడం ఇప్పుడు మరింత సులభమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు, ప్రొఫైళ్లు, సందేశాలు నిజమైన వ్యక్తులకు సంబంధించినవేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏఐ ఆధారిత క్యారెక్టర్లు వినోదం, సమాచార సేవలు, వర్చువల్ స్నేహం వంటి అవసరాలకు ఉపయోగపడుతున్నప్పటికీ.. వాటి అసలు స్వరూపాన్ని దాచిపెట్టి వ్యక్తిగత సంబంధాలను పెంచుకోవడం సమస్యలకు దారితీయవచ్చు.
ముఖ్యంగా ఆన్లైన్ పరిచయాల విషయంలో భావోద్వేగాలకు లోనై ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. ప్రత్యక్షంగా కలవని వ్యక్తుల కోసం డబ్బు పంపించడం.. అప్పులు చేయడం.. ఆస్తులు అమ్ముకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. అలాగే అనుమానాస్పద ఖాతాల వెనుక ఉన్న వ్యక్తుల నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవడం అవసరం.
మార్టిన్స్‌కు ఎదురైన అనుభవం టెక్నాలజీని ఉపయోగించడంలో అప్రమత్తత ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. ఆన్లైన్లో ఏర్పడిన ప్రతి బంధాన్ని గుడ్డిగా నమ్మడం కంటే.. నిజానిజాలను తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఎందుకంటే.. డిజిటల్ ప్రపంచంలో కనిపించే ప్రేమ నిజమైనదే కావాలని లేదు. కొన్నిసార్లు అది మనిషి సృష్టించిన పాత్ర కావచ్చు.. మరికొన్నిసార్లు ఏఐ సృష్టించిన మాయ కూడా కావచ్చు.. సో బీ కేర్ ఫుల్ నాయనలారా..