చంద్రబాబును వదులుకున్న బీజేపీ.. ఇప్పుడేం చేస్తుంది?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంబంధాలపై భయపడిన తెలంగాణ బీజేపీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందనే విమర్శలు ఎదుర్కొంటోంది.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంబంధాలపై భయపడిన తెలంగాణ బీజేపీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఒకవైపు చంద్రబాబు పార్టీ టీడీపీ మద్దతుతో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. తెలంగాణలో టీడీపీ మద్దతు కోరే విషయంలో వెనకడుగు వేస్తోందని అంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఏపీకే పరిమితం చేయాలని, చంద్రబాబుతో పొత్తు అంటే తెలంగాణలో నష్టపోవాల్సివస్తుందని టీ.బీజేపీ నేతలు భయపడ్డారు. అయితే ఇప్పుడు చంద్రబాబు పార్టీతో పొత్తు లేకపోవడం వల్ల జూబ్లీహిల్స్ లో నష్టపోవాల్సివచ్చిందనే చర్చ మొదలైంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీగా తలపడిన బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడో స్థానానికే పరిమితమైన కమలం పార్టీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకంటే తక్కువ ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తాజా ఓటమితో పరువు పోగొట్టుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని గల్లీగల్లీలో తిరిగినా కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అయితే బీజేపీ ఈ ఫలితాలు ఎదుర్కోడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు గంపగుత్తగా కాంగ్రెస్ కు ఓటు వేశారని విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీ.సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సానిహిత్యమే అంటున్నారు.సీఎం రేవంత్ రెడ్డి సైతం టీడీపీ కేడర్ ను ఆకట్టుకునేలా అనేక ప్రయత్నాలు చేయగా, బీజేపీ నుంచి కనీస ప్రయత్నం కూడా జరగని విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. ఇక ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పోటీపడిందని కూడా చెబుతున్నారు. కానీ, బీజేపీ మాత్రం టీడీపీ ఓటర్లకు దగ్గరయ్యే పని ఏదీ చేయకపోవడం వల్ల వారి ఓట్లను కోల్పోవాల్సివచ్చిందని, కమలదళం డిపాజిట్ దక్కించుకోలేకపోవడానికి ఇదీ ఒక కారణమని అంటున్నారు.
కేంద్రంలో అటు ఏపీలో పొత్తుతో ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ తెలంగాణలో టీడీపీని చేరదీయకపోవడానికి కూడా కొన్ని కారణాలు చూపుతున్నారు. ప్రధానంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాకే టీ.బీజేపీ టచ్ మీ నాట్ అన్న ధోరణితో తెలంగాణలో టీడీపీ కేడర్ తో వ్యవహరిస్తోందని అంటున్నారు. అందుకే టీ.టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడవడానికే ప్రాధాన్యమిస్తుందని అంటున్నారు. బీజేపీ ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్తులో జూబ్లీహిల్స్ వంటి ఫలితాలు ఎదుర్కోక తప్పదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
బీఆర్ఎస్ విమర్శలకు భయపడి బీజేపీ.. టీడీపీని దూరం పెడితే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలతోపాటు నగరం విస్తరించిన దాదాపు 30 నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో బీజేపీ చాలా నష్టపోవాల్సివస్తుందని అంటున్నారు. టీడీపీ అంటే ఒంటి కాలిపై లేచే బీఆర్ఎస్ సైతం జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో తన వైఖరిని సడలించుకుని, తమ అధినేత టీడీపీ నుంచే వచ్చారని, తమ బ్లడ్ లోనూ టీడీపీ ఉందని చెప్పుకుంది. ఇదే విధమైన ప్రచారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూసుకుపోయారు. కానీ, బీజేపీ మాత్రం ఈ విషయంలో వెనకబడి తగిన మూల్యం చెల్లించుకుందని అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ అనుభవంతో బీజేపీ భవిష్యత్తులో అయినా తన విధానాన్ని సమీక్షించుకుంటే మంచిదని కొందరు సలహాలిస్తున్నారు. కానీ, టీ.బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తున్నారనేదే అర్థం కావడం లేదని అంటున్నారు.