ఏపీ ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్.. ఆప్షన్స్ ఇవే!?
ఈ బెట్టింగ్ పదివేల నుంచి మొదలై కోట్ల వరకూ నడుస్తుందన్ని అంటున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం జూన్ 4 వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్ లో పందెం రాయుళ్ల సందడి మొదలైంది. ఐపీఎల్ నుంచి కోడిపందాల వరకూ కాదేదీ బెట్టింగ్ కి అనర్హం అన్నట్లుగానే పోలింగ్ ముగిసిన అనంతరం బెట్టింగ్ బ్యాచ్ మొదలుపెట్టేసిందని తెలుస్తుంది. ఈ బెట్టింగ్ పదివేల నుంచి మొదలై కోట్ల వరకూ నడుస్తుందన్ని అంటున్నారు.
అవును... ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బెట్టింగ్స్ మొదలైపోయాయి. ప్రధానంగా పిఠాపురం, మంగళగిరి, కుప్పం, ఉండి, పులివెందుల, గుడివాడ, కడప ఎంపీ స్థానాలపై పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపై బెట్టింగ్ బేసిక్ ఆప్షన్స్ గా నడుస్తుండగా.. మెజారిటీపైనా బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా మంగళగిరిలో గెలిచేదెవరు? కడప ఎంపీ స్థానం దక్కించుకునేదెవరు? భీమిలిలో పరిస్థితి ఏంటి? ఉండిలో ట్రిపుల్ ఆర్ గట్టెక్కుతారా? పిఠాపురంలో పవన్ గెలుస్తారా? పులివెందులలో జగన్ మెజారిటీ? కుప్పంలో చంద్రబాబు పరిస్థితి? కొడాలి నానీ ఈసారి కూడా కొడతారా? ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు.
ఇవి ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో జరిగే బెట్టింగ్స్ కాగా... స్థానికంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో జరిగే బెట్టింగుల్లో రకరకాల ఆప్షన్స్ తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా గెలుపు ఓటములతో పాటు 1000, 2000, 3000 ల మెజారిటీలపైనా బెట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయని చెబుతున్నారు.
ఇదే క్రమంలో.. సదరు అభ్యర్థి ఓడిపోతాడు అని బెట్టింగ్ తో పాటు ఎంత మార్జిన్ తో ఓడిపోతాడనేదీ ఇక్కడ మరో ఆప్షన్ గా ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై మాత్రం 1:5 చొప్పున అంటే.. లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నట్లు సమాచారం.
కోడిపందేలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో కాయ్ రాజా కాయ్ అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చోటా నేతలు, కొందరు వ్యాపారులు, ఊర్లో పెద్దమనుషులుగా చలామణీ అయ్యేవారూ మధ్యవర్తులుగా అవతారమెత్తినట్లు చెబుతున్నారు. ఎవరు గెలిచినా తమకు 1 - 5 శాతం కమీషన్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు.