కేవ‌లం గోల్ఫ్ ఆట ఆడి 1861 కోట్లు సంపాదించిన సామాన్యుడు

స్వయంగా గోల్ఫ్ క్రీడాకారుడైన తండ్రి... తన కుమారుడికి తొలి గురువుగా మారి ఆటలోని మెళ‌కువలను నేర్పాడు.;

Update: 2026-04-15 04:44 GMT

సాధారణంగా గోల్ఫ్ అంటే ధనవంతుల క్రీడ అనే ముద్ర ఉంది. కానీ ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ స్మిత్ ప్రయాణం ఈ అంచనాలను తలకిందులు చేసింది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కామెరాన్.. నేడు అంతర్జాతీయ గోల్ఫ్ రంగంలో ధృవతారగా వెలుగుతున్నాడు. అతని నికర ఆస్తి విలువ ప్రస్తుతం దాదాపు 1861 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అయితే ఈ అంకె వెనుక ఒక యువకుడి పట్టుదల కంటే..అతడి తల్లిదండ్రుల అపారమైన త్యాగం దాగి ఉంది. క్రీడల్లో రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు.. వెన్నుతట్టి ప్రోత్సహించే కుటుంబం ఉండాలని కామెరాన్ స్మిత్ విజయగాథ నిరూపిస్తోంది.

కామెరాన్ గోల్ఫ్ కలలను నిజం చేసేందుకు అతని తల్లిదండ్రులు పడిన కష్టం వర్ణనాతీతం. ఖరీదైన గోల్ఫ్ కిట్లు, శిక్షణ, టోర్నమెంట్ల కోసం అయ్యే భారీ ఖర్చును భరించేందుకు అతడి తల్లి షారన్ ఏళ్ల తరబడి రాత్రిపూట విధులు నిర్వహించింది. అదే సమయంలో అతడి తండ్రి డెస్ స్మిత్ ఏకకాలంలో మూడు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక వనరులను సమకూర్చాడు. స్వయంగా గోల్ఫ్ క్రీడాకారుడైన తండ్రి... తన కుమారుడికి తొలి గురువుగా మారి ఆటలోని మెళ‌కువలను నేర్పాడు. బ్రిస్బేన్‌లోని ఒక చిన్న క్లబ్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ప్రపంచ వేదికలపై ఆస్ట్రేలియా జెండాను ఎగురవేసే వరకు సాగింది.

2013లో వృత్తిపరమైన గోల్ఫ్ క్రీడాకారుడిగా మారిన కామెరాన్ పీజీఏ టూర్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచి తన సత్తా చాటాడు. ముఖ్యంగా 2022లో జరిగిన చారిత్రాత్మక `ది ఓపెన్ ఛాంపియన్‌షిప్` గెలవడంతో అతడి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆ తర్వాత సౌదీ అరేబియా మద్దతు ఉన్న లివ్ గోల్ఫ్ లీగ్‌లో చేరడం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ లీగ్‌తో కుదుర్చుకున్న సుమారు 840 కోట్ల రూపాయల భారీ ఒప్పందం అతన్ని ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడాకారుల జాబితాలో నిలబెట్టింది. ఇప్పుడు మధ్యతరగతి కుర్రాడు కాస్తా.. అపర కుబేరుడిగా ఎదిగిన తీరు క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.

కామెరాన్ స్మిత్ విజయం కేవలం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదు. ఎంతటి స్టార్‌డమ్- సంపద వచ్చినా, తన మూలాలను అతడు ఎప్పుడూ మర్చిపోలేదు. నేటికీ తన విజయానికి పునాది తన తల్లిదండ్రుల కష్టమేనని అతడు బహిరంగంగా ప్రకటిస్తుంటాడు. గోల్ఫ్ క్రీడలో రాణించాలంటే కేవలం ధనవంతులై ఉండక్కర్లేదని.. సరైన పట్టుదల .. కుటుంబ సభ్యుల అండ ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని అతడు నిరూపించాడు. నేడు ఈ యువ‌క్రీడాకారుడు ఎంతో మంది అట్టడుగు స్థాయి క్రీడాకారులకు ఒక గ్లోబల్ ఐకాన్‌గా.. స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నాడు.

ఒక క్రీడాకారుడి ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ. కామెరాన్ స్మిత్ సాధించిన రూ.1861 కోట్ల సంపద కేవలం అతని ఆటవల్ల వచ్చింది కాదు.. అది అతడి తల్లిదండ్రుల రాత్రింబవళ్ల శ్రమకు దక్కిన ప్రతిఫలం. అమ్మానాన్నలు ప్రోత్సహిస్తే.. ఒక సాధారణ యువకుడు కూడా ప్రపంచాన్ని జయించగలడని ఈ ఉదంతం చాటిచెబుతోంది. ఈ సక్సెస్ స్టోరీ కేవలం క్రీడాకారులకే కాకుండా, తమ పిల్లల కలల కోసం శ్రమించే ప్రతి తల్లిదండ్రికీ ఒక గొప్ప భరోసాను ఇస్తుంది.

Tags:    

Similar News