భారతీయురాలికి అవమానం: అరుణాచల్ విషయంలో చైనా ‘అదే అక్కసు’!
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా తన పాత రాజకీయ వైఖరిని మరోసారి బయటపెట్టింది.;
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా తన పాత రాజకీయ వైఖరిని మరోసారి బయటపెట్టింది. లండన్ నుంచి జపాన్‌కు వెళుతున్న ఒక భారత మహిళకు షాంగై విమానాశ్రయంలో చైనీస్ ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ఘోర అవమానం ఎదురైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అవమానానికి గురైన మహిళ పేరు పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్. ఈమె అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినవారు. నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు వెళ్తున్న పెమా ప్రయాణ విమానం, షాంఘైలోని పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కోసం ఆగింది. అక్కడ ఆమె పాస్‌పోర్ట్‌ను తనిఖీ చేసిన చైనీస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, “అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందింది… కాబట్టి ఈ పాస్‌పోర్ట్ చెల్లదు” అంటూ ఆమెను నిలదీశారు. చైనా ఇమ్మిగ్రేషన్ సిబ్బంది, అలాగే చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆమెను చూసి నవ్వుతూ, “చైనీస్ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోమని” హేళన చేసినట్లు పెమా మీడియాకు వెల్లడించారు.
* వీసా ఉన్నా విమానంలో ఎక్కనివ్వలేదు
చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, చైనీస్ అధికారులు ఆమెను జపాన్‌కు వెళ్లే తదుపరి విమానంలో ఎక్కకుండా అడ్డుకున్నారు. అధికారులు ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, ఆమెను కేవలం ట్రాన్సిట్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు. అంతేకాకుండా, ఆమె తిరిగి టికెట్ బుక్ చేసుకునే అవకాశం నిరాకరించారు. కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా అనుమతించలేదని, ఈ చర్య ఆమెను పూర్తిగా ఇరుకులో నెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
* భారత దౌత్య సహాయంతో విముక్తి
పెమా ఈ కష్టకాలంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆమె స్నేహితురాలు షాంఘైలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించారు. భారత దౌత్యాధికారులు వెంటనే ఈ వివాదంలో జోక్యం చేసుకున్న తర్వాతే ఆమెపై విధించిన 'అన్యాయ నియంత్రణ' ఎత్తివేయబడింది. దౌత్య జోక్యంతో ఆమెకు తిరిగి ప్రయాణం చేసే అవకాశం లభించింది.
* ప్రధాని మోదీకి లేఖ
ఈ అవమానకర సంఘటనపై పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. ఇతర భారత సీనియర్ అధికారులకు లేఖ రాశారు. “ఇది అరుణాచల్ ప్రదేశ్ ప్రజల గౌరవాన్ని, భారత సార్వభౌమత్వాన్ని అవమానించే చర్య” అని ఆమె లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
* చైనా పాత వైఖరియే కారణం
ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా పేర్కొంటూ చైనా అనుసరిస్తున్న పాత, వివాదాస్పద రాజకీయ వైఖరికి నిదర్శనం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అరుణాచల్ ప్రజలకు చైనా వీసాలు కాకుండా స్టాపిల్డ్ వీసాలు అంటే పాస్‌పోర్ట్‌కు పిన్ కొట్టిన వీసా మాత్రమే జారీ చేయడం కూడా ఈ వైఖరిలో భాగమే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తరఫున ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.