సర్..... పార్టీలకు సుర్.. సుర్..!
వాస్తవానికి అధికార పార్టీలో ఈ తరహా విధానం, ప్రక్రియ వంటివి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. పైగా బిజెపి సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సర్ ప్రక్రియను స్వాగతించారు.
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియ అని పార్టీలోనూ గుబులు రేపుతోంది. ఇటు అధికారపక్షం టిడిపిలోను.. అటు ప్రతిపక్ష వైసిపీలోను నాయకులు పెద్ద ఎత్తున సర్ ప్రక్రియపై తర్జన భర్జన పడుతున్నారు. తమ ఓటు బ్యాంకు ఎక్కడ పోతుందో అనే చర్చ కనిపిస్తోంది. దీంతో టిడిపి వైసిపిలు ఎవరికి వారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు సర్ విధానం పై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా కూడా క్షేత్రస్థాయిలో నాయకులకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు.
వాస్తవానికి అధికార పార్టీలో ఈ తరహా విధానం, ప్రక్రియ వంటివి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. పైగా బిజెపి సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సర్ ప్రక్రియను స్వాగతించారు. అయితే, ఏపీలో మాత్రం వైసిపి తమ ఓటు బ్యాంకు ను ఎక్కడ తీసేస్తుందో అన్న చర్చ టిడిపిలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. వైసీపీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తమకు బలం లేని చోట ఓటు బ్యాంకును సృష్టించుకునేందుకు టిడిపి ఓట్లను తొలగించే అవకాశం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు వైసీపీ కూడా ఇదే ఆలోచనతో ఉంది. తమ ఓటు బ్యాంకు ను ఎక్కడ తీసేస్తారో అనే చర్చ వైసీపీలో కూడా జరుగుతోంది. ఇక మిగిలిన పార్టీలలో ఈ తరహా చర్చ పెద్దగా లేనప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? అనే విషయంపై పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ `సర్` ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. దీనికి ఏపీ పార్టీ చీఫ్ గా ఉన్న షర్మిల కూడా మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో ప్రారంభంకాను న్న సర్ ప్రక్రియపై షర్మిల ఎలాంటి వ్యూహాలు రచిస్తారు.. ఏ విధంగా ముందుకు సాగుతారు అనేది చూడాలి. నిజానికి ఇతర పార్టీలకు క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే క్యాడరు, నాయకులు కూడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. గతంలో షర్మిల వచ్చినప్పుడు కొంతమంది సీనియర్ నాయకులు ఆమెను కలుసుకునేవారు. ఇటీవల కాలంలో అది కూడా తగ్గిపోయింది.
దీంతో ఇప్పుడు సర్ విషయంలో ఏం చేస్తారనేది చూడాలి. ఇక, జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించింది. జనసేన ఓటు బ్యాంకు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకటికి రెండుసార్లు జాబితాలను పరిశీలించాలని కూడా పేర్కొంది. ఇంటింటికి తిరగడంతో పాటు జనసేన అనుకూల ఓటర్లను అప్రమత్తం చేయాలని కూడా పేర్కొంది. పార్టీ తరఫున ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకులు ఇంటింటికి వెళ్లి తమ ఓటు బ్యాంకును పరిరక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ సర్ ప్రక్రియపై తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.