సోష‌ల్ మీడియా చ‌ట్టంపై బాబు స‌ర్కారు వెన‌క్కి..!

ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియా అనేది ఐటీ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తుంది. దీనిని కేంద్ర ప్ర‌భుత్వ‌మే చూస్తుంది.;

Update: 2025-09-28 08:30 GMT

సోష‌ల్ మీడియా.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం.. కూట‌మి స‌ర్కారును కుదిపేస్తోంది. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు కూడా వారు చేస్తున్న ప‌నుల‌ను సోష‌ల్ మీడియా క‌నిపెడుతోంది. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప్ర‌జ‌ల ముందు పెడుతోంది. దీని వెనుక వైసీపీ ఉందా?. లేక‌, సొంత పార్టీల‌కు చెందిన అసంతృప్త నాయ‌కులు ఉన్నారా? అనేది తెలియ‌క‌పోయినా.. గుండుగుత్త‌గా మాత్రం సోష‌ల్ మీడియాను క‌ట్టడి చేస్తే.. ఇక‌, ఇబ్బందులు ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాపై చ‌ట్టం చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

ప్ర‌స్తుతం వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే సోష‌ల్ మీడియాపై చ‌ట్టం తీసుకురావాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించి మంత్రుల‌తో క‌మిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామ‌ని.. గ‌త కేబినెట్ స‌మావేశంలోనూ చెప్పారు. అంతేకాదు.. ఈ క‌మిటీ రిపోర్టు ఆదారంగా బిల్లు రెడీ చేసి.. అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. కానీ, అనూహ్యంగా ఈ విష‌యం నుంచి ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. సోష‌ల్ మీడియాపై చ‌ట్టం చేయ‌డం స‌రికాద‌న్న సీనియ‌ర్ అధికారుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాన్ని వాయిదా వేసింది.

ఎందుకు..?

ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియా అనేది ఐటీ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తుంది. దీనిని కేంద్ర ప్ర‌భుత్వ‌మే చూస్తుంది. దీనికి భిన్నంగా రాష్ట్రాల్లో చ‌ట్టం చేసినా.. దానిని కేంద్రానికి పంపించాలి. అయితే.. గ‌త నెల‌లోనే కేంద్రం రాష్ట్రాల‌కు కొన్ని సూచ‌న‌లు చేసింది. సోష‌ల్ మీడియాపై ఎవ‌రూ చ‌ట్టాలు చేయ‌డానికి వీల్లేద‌ని. ఏదైనా ఉంటే.. తామే చూసు కుంటామ‌ని పేర్కొంది. పైగా ఇదేస‌మ‌యంలో సుప్రీంకోర్టు కూడా.. సోష‌ల్ మీడియాను భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌గా పేర్కొంది. మ‌రో వైపు.. నేపాల్‌లో చెలరేగిన అల్ల‌ర్ల వెనుక‌.. సోష‌ల్ మీడియా దిగ్భంద‌నం ప్ర‌ధాన కార‌ణంగా మారిం ది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే రాష్ట్ర స‌ర్కారు సోష‌ల్ మీడియాపై చట్టం చేసేందుకు వెన‌క్కి త‌గ్గింద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి తెర‌వెనుక‌.. సోష‌ల్ మీడియా వ్య‌క్తుల‌పై కేసులు పెడుతున్నారు. పోలీసుల‌తో కొట్టిస్తున్నారు. వీటిపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందిస్తోంది. మొత్తంగా క్షేత్ర‌స్థాయిలో ఇది పెద్ద ప్ర‌భావం చూపిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు లేని పోని చ‌ట్టం తీసుకువ‌చ్చి.. మ‌రింత ఉక్కుపాదం మోపితే.. అది మ‌రీ ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేసుకున్న స‌ర్కారు.. ఇప్పుడు పూర్తిగా చ‌ట్టం జోలికి పోకుండా ఉండాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News