‘మిత్రుడి ప్రాణం బలిగొన్నారు’... ఎమ్మెల్యే గంటా సంచలనం!
మరోవైపు శాసనసభలో గురువారం 'శాంతి భద్రతలు' అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా హోమంత్రి అనిత మాట్లాడారు.;
ఏపీ శాసనసభలో శాంతిభద్రతలపై చేపట్టిన చర్చ అత్యంత ఆసక్తికరంగా, సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయంటూ మండిపడ్డారు. ఇప్పడు కూడా జగన్ ఎంతో దారుణంగా రాజకీయాలు చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సంచలన విషయం గుర్తుచేసుకున్నారు!
అవును... గురువారం శాసనసభలో గత ప్రభుత్వ హయాంలోని వేధింపులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్ని, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను ఫార్వార్డ్ చేసినందుకు వైసీపీ ప్రభుత్వం తన మిత్రుడైన నలంద కిశోర్ ప్రాణాన్ని బలి తీసుకుందని అన్నారు. నాడు ఈ నలంద కిశోర్ విషయంలో ఏమి జరిగిందనే విషయాన్ని సభలో పంచుకున్నారు!
ఇందులో భాగంగా.. కొవిడ్ సమయంలో అమెరికా నుంచి ఫార్వర్డ్ అయిన వాట్సాప్ మెసేజ్ ను తన మిత్రుడు ఇతర స్నేహితుల ఫోన్ లకు పంపించారని.. అయితే ఆ మెసేజ్ అప్పటి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిని కొంత అవమానపరిచేలా ఉందని వెంటనే సీఐడీ కేసు నమోదు చేసిందని.. అనంతరం తన మిత్రుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
ఆ సమయంలో కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదని.. ఆ క్రమంలో ముందుగా విశాఖలో అరెస్టు చేసి, కేసును విజయనగరంలో విచారించే అవకాశమున్నప్పటికీ.. కావాలని ఇరుకైన కారులో కొవిడ్ నిబంధనలు అతిక్రమించి కర్నూలుకు తరలించారని తెలిపారు. ఆ కారణంగానే కొవిడ్ బారినపడిన తన మిత్రుడు చనిపోయారని గంటా గుర్తు చేసుకున్నారు!
హోంమంత్రి సీరియస్!:
మరోవైపు శాసనసభలో గురువారం 'శాంతి భద్రతలు' అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా హోమంత్రి అనిత మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిని వదిలిపెట్టేది లేదని తెలిపారు.
ఎవరినైనా ఏదైనా అనేసి, ఐపీ అడ్రస్ మార్చేస్తే ఏమీ చేయలేరని, ఎక్కడో ఉండి పోస్ట్ పోడితే ఏమీ కాదనుకుంటున్నారని.. అలా ఎవరూ భావించొద్దని.. తప్పుడు ప్రచారాలు చేసే ప్రతి ఒక్కరినీ ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని.. తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు చేసేవారిని ఎవరినీ వదిలిపెట్టమని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికే చట్టసవరణ చేయనున్నామని తెలిపారు.