షాకింగ్ రిపోర్ట్: 60 శాతం మంది భార‌తీయ‌ స్త్రీలు దానికి అడిక్ట్

కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా థ్రిల్లర్స్, ఫాంటసీ, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్లలో కొరియన్ మేకర్స్ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తారు.

Update: 2026-10-04 10:12 GMT

స‌హ‌జంగా టీవీ సీరియ‌ళ్లు చూసే ఆడ‌వారి మ‌న‌స్త‌త్వాల‌ను చ‌దివేయ‌డం ఎన‌లిస్టుల‌కు కూడా అంత సులువేమీ కాదు. ఆ మాటకొస్తే స్త్రీల‌కు ఏది న‌చ్చుతుందో.. ఏది న‌చ్చ‌దో విశ్లేషించ‌డం కాంప్లికేటెడ్ టాస్క్. అయితే భార‌తీయ సాంప్ర‌దాయాలు, కుటుంబ జీవ‌న విధానాన్ని ప్ర‌పంచం ఎప్పుడూ హ‌ర్షించ‌డానికి కార‌ణం ఇక్క‌డి అంద‌మైన సంస్కృతి.. స్త్రీల విధివిధానాలు.. అయితే అలాంటి స‌నాత‌న భార‌తావ‌నిలో స్త్రీలు ఇప్పుడు విదేశీ డ్రామాల‌కు అల‌వాటు ప‌డిపోతున్నారు. కే- డ్రామా పేరుతో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈ స‌రికొత్త డ్రామాల‌ గురించి తెలుసుకునేవారికి తెలుసుకున్నంత‌. అస‌లు భార‌తీయ స్త్రీల మ‌న‌సులు గెలుచుకునేంత ఈ డ్రామాల్లోనే ఏం ఉంది? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.

భారతదేశంలో కొరియన్ డ్రామాల (K-డ్రామాస్) ఆదరణ రోజురోజుకూ అసాధారణ రీతిలో పెరుగుతున్న తీరే దీనికి నిద‌ర్శ‌నం. ప్రముఖ మీడియా కన్సల్టెన్సీ సంస్థ `ఆర్మాక్స్ మీడియా` విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో కొరియన్ డ్రామాల వీక్షకుల సంఖ్య ఒక సంవత్సరంలో ఏకంగా 48 శాతం పెరిగి 107.8 మిలియన్ల(10.78 కోట్లు)కు చేరింది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా కుటుంబ ప్రేక్షకులు సైతం ఈ కొరియన్ కథల వైపు ఆకర్షితులు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విష‌యాలు తెలిసాయి.

భారతీయ ఫ్యామిలీ ప్రేక్షకులు కే-డ్రామాలు ఇష్టపడటానికి ప్రధాన కారణం వాటిలోని కుటుంబ బంధాలు- మానవ సంబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత. పాశ్చాత్య కంటెంట్‌లా కాకుండా.. కొరియన్ సీరియల్స్‌లో తల్లిదండ్రులపై గౌరవం, తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు, స్నేహం- నైతిక విలువలకు పెద్దపీట వేస్తారు. మన సంస్కృతికి ఎంతగానో దగ్గరగా ఉండే ఈ భావోద్వేగాలు భారతీయ గృహిణులను, కుటుంబ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఇవే కాకుండా.. కొరియన్ డ్రామాలలో కనిపించే అమాయకమైన ప్రేమ, ఎమోషనల్ డెప్త్ .. హృద్యమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తాయి. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా, అత్యంత సున్నితంగా .. రొమాంటిక్‌గా కథలను నడిపించే విధానం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలకు ఫిదా అవుతున్నారు. అందుకే ఆర్మాక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో కే-డ్రామాలు చూస్తున్న వారిలో దాదాపు 60 శాతం మంది మహిళలే ఉండటం విశేషం.

కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా థ్రిల్లర్స్, ఫాంటసీ, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్లలో కొరియన్ మేకర్స్ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. `స్క్విడ్ గేమ్` వంటి సిరీస్‌లు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సమాజంపై ఒక బలమైన సందేశాన్ని ఇస్తాయి. ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకులను స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తూ.. కుటుంబం అంతా కలిసి ఆస్వాధించేలా మలుస్తున్నాయి. దీనికి తోడు కొరియన్ సిరీస్‌లలోని రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, పాత్రల కాస్ట్యూమ్స్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక విజువ‌ల్ ఫెస్ట్ ను తలపిస్తాయి. అక్కడి ప్రకృతి అందాలు, సాంప్రదాయ వంటకాలు.. జీవనశైలిని చూపించే విధానం ప్రేక్షకులకు దృశ్యపరంగా సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈ విజువల్ గ్రాండియారిటీ కారణంగానే కేవలం మొబైల్స్‌లోనే కాకుండా.. కనెక్టెడ్ టీవీల (CTV) ద్వారా కుటుంబ సమేతంగా పెద్ద స్క్రీన్‌లపై కే-డ్రామాలను వీక్షించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

భాషతో సంబంధం లేకుండా మానవ మనస్తత్వంలోని లోతులను, భావోద్వేగాలను కొరియన్ డ్రామాలు అత్యంత సహజంగా ఆవిష్కరిస్తాయి. సబ్‌టైటిల్స్ లేదా డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వస్తున్న ఈ కంటెంట్, భారతీయ ప్రేక్షకుల మానసిక స్థితికి సరిగ్గా సరిపోతుంది. తమ నిత్య జీవితపు ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందడానికి.. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి కే-డ్రామాలు ఒక చక్కని వేదికగా మారుతుండటమే భారతదేశంలో వీటి అఖండ విజయానికి అసలు రహస్యం.

Tags:    

Similar News