కోలీవుడ్‌లో తదుపరి దళపతి ఎవరు?
సాధారణంగా విజయ్‌కు గట్టి పోటీ ఇచ్చే హీరో అజిత్ కుమార్. ఇద్దరి మధ్య ఉండే `తల-దళపతి` పోరు కోలీవుడ్ బాక్సాఫీస్‌కు ప్రధాన ఆదాయ వనరు.;
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమ ఓ చారిత్రాత్మక మార్పుకు సాక్షిగా నిలుస్తోంది. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన దళపతి విజయ్ రాజకీయ పార్టీ తమిళ వెట్రి కళగం స్థాపనతో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కుర్చున్నారు. ఇకపై విజయ్ జీవితం ప్రజా సేవకేనని తేలిపోయింది. ఆయన మళ్లీ మ్యాకప్ వేసుకోవడం అన్నది దాదాపు అసాధ్యమే. అయితే రజనీకాంత్ తర్వాత మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న ఏకైక హీరోగా విజయ్ స్థానాన్ని భర్తీ చేసే తదుపరి దళపతి ఎవరు అనేది ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సాధారణంగా విజయ్‌కు గట్టి పోటీ ఇచ్చే హీరో అజిత్ కుమార్. ఇద్దరి మధ్య ఉండే `తల-దళపతి` పోరు కోలీవుడ్ బాక్సాఫీస్‌కు ప్రధాన ఆదాయ వనరు. అయితే అజిత్ ప్రస్తుతం తన దృష్టిని సినిమాల కంటే ఎక్కువగా కార్ రేసింగ్ , వరల్డ్ టూర్ల పైనే పెడుతున్నారు. ఆయన ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనంగా మారుతున్న తరుణంలో విజయ్ వదిలి వెళ్తున్న భారీ కమర్షియల్ మార్కెట్‌ను అజిత్ ఒంటిచేత్తో నడిపిస్తారా? అనేది అనుమానంగానే ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నటన పరంగా అసాధారణ ప్రతిభ ఉన్న సూర్య, విక్రమ్, ధనుష్ వంటి హీరోలు రేసులో ఉన్నారు.
ధనుష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తూ గ్లోబల్ గుర్తింపు పొందుతున్నారు. విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అయితే విజయ్ సాధించిన మాస్ అప్పీల్, ఓపెనింగ్ డే కలెక్షన్ల రేంజ్ అందుకోవడం ప్రతీసారి సవాలుగానే మారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమను ఇప్పటికీ సీనియర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్లే ముందుండి నడిపిస్తున్నారు. `జైలర్`, `విక్రమ్`వంటి విజయాలతో తాము ఇంకా బాక్సాఫీస్ కింగ్‌లమే అని నిరూపించుకున్నారు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే యువ తరం హీరోల్లో శివకార్తికేయన్ వంటి వారు విజయ్ బాటలో నడుస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువవుతున్నారు.
విజయ్ వదిలిన స్థానాన్ని కేవలం ఒక హీరో మాత్రమే భర్తీ చేయడం సాధ్యం కాదని అది పలువురు హీరోల మధ్య పంపిణీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ ఇమేజ్ అనేది సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనకున్న అభిమాన సంఘాలు ఒక సైన్యంలా పని చేస్తాయి. అలాంటి బలమైన పునాది కలిగిన స్టార్ ఇమేజ్‌ను సంపాదించడం ఏ హీరోకైనా దశాబ్దాల సమయం పడుతుంది. తమిళనాట సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. అది రాజకీయాలకు కూడా సోపానం. అందుకే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఏర్పడే ఖాళీని పూడ్చడానికి నిర్మాతలు సైతం కొత్త వ్యూహాలను రచించాల్సి వస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలకు గ్యారెంటీ ఇచ్చే స్టార్ కోసం కోలీవుడ్ వెతుకులాట మొదలైంది.