400 కోట్ల దావా: రీమిక్స్ వివాదంలో యంగ్ హీరో కొత్త సినిమా!
ఈ వివాదాస్పద రీమిక్స్ సాంగ్ ఒరిజినల్ వెర్షన్.. 1999లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా వషు భగ్నానీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం `బీవీ నెం. 1` లోనిదన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్.. స్టార్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మధ్య `డాన్ ` విషయంలో జరిగిన వివాదం మరువక ముందే.. ముంబై సినీ వర్గాల్లో మరో భారీ కోర్ట్ వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ సీనియర్ నిర్మాత వషు భగ్నానీ బాంబే హైకోర్టును ఆశ్రయిస్తూ ఏకంగా రూ. 400 కోట్ల భారీ నష్టపరిహార దావా వేశారు. టాలెంటెడ్ హీరో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్న తదుపరి చిత్రం `హై జవానీ తో ఇష్క్ హోనా హై` లోని `చునరి చునరి` క్లాసిక్ సాంగ్ రీమిక్స్ వాడకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా.. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ పాటను సినిమాలో ఉపయోగించారని వషు భగ్నానీ టిప్స్ మ్యూజిక్ , దర్శకుడు డేవిడ్ ధావన్‌లపై లీగల్ బ్యాటిల్‌కు దిగారు. ఈ వివాదాస్పద రీమిక్స్ సాంగ్ ఒరిజినల్ వెర్షన్.. 1999లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా వషు భగ్నానీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం `బీవీ నెం. 1` లోనిదన్న సంగతి తెలిసిందే.
ఈ కాపీరైట్ వివాదం నేపథ్యంలో వషు భగ్నానీ బాంబే హైకోర్టును ఆశ్రయించి జూన్ మొదటి వారంలో విడుదల కావాల్సిన `హై జవానీ తో ఇష్క్ హోనా హై` సినిమా విడుదలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు రూ. 400 కోట్ల భారీ పరిహారాన్ని క్లెయిమ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. వివాదంలో ఉన్న సదరు ఆడియో కంపెనీ(టిప్స్)కి కేవలం ఒరిజినల్ ఆడియో రైట్స్ (పాటలను ప్లే చేసే హక్కులు) మాత్రమే ఉన్నాయని... ఆ పాటను మళ్లీ రీమేక్ లేదా రీమిక్స్ చేసే హక్కులు వారికి లేవని స్పష్టం చేశారు. నిజానికి 2018లోనే ఈ పాట విజువల్ రైట్స్ (రీమేక్ హక్కులు) కోసం టిప్స్ మ్యూజిక్ సంస్థ వషు భగ్నానీని సంప్రదించినా.. అప్పట్లో వారి మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరలేదని లీగల్ టీమ్ వెల్లడించింది. ఈ క్రమంలోనే వషు భగ్నానీకి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. గతంలో టిప్స్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన ఆడియో హక్కులను కూడా రద్దు చేయాలంటూ తాజాగా లీగల్ నోటీసులు పంపడం సంచలనంగా మారింది.
మరోవైపు ఈ వివాదంపై ధావన్ అండ్ టీమ్.. మ్యూజిక్ లేబుల్ భిన్నమైన రీతిలో స్పందించాయి. ఇటీవల జరిగిన `హై జవానీ తో ఇష్క్ హోనా హై` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టిప్స్ మ్యూజిక్ అధినేత రమేష్ తౌరానీ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని.... ఈ వివాదానికి సంబంధించిన సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యాయని ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అయితే వషు భగ్నానీ తాజా లీగల్ నోటీసులు, కోర్టు దావాల నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ భారీ చిత్రానికి వరుణ్ ధావన్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన టాలీవుడ్ - బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. తండ్రి కొడుకుల కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ రోమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేసి కొత్త సినిమాల్లో వాడుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే లీగల్ కాపీరైట్స్ - రాయల్టీల విషయంలో సరైన ఒప్పందాలు లేకపోవడం వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయి. తాజా వివాదం నేపథ్యంలో బాంబే హైకోర్టు ఈ రూ. 400 కోట్ల దావాపై ఎలాంటి తీర్పునిస్తుంది? వరుణ్ ధావన్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా లేదా? అనేది వేచి చూడాల్సిందే.