సూర్యకి త్రివిక్రమ్ కాంబో.. అసలు మేటర్ ఇదే!
'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్ లో అందరూ ఆ సినిమా గురించే మాట్లాడారు. కానీ త్రివిక్రమ్ మాత్రం సూర్యతో తన సినిమా ఎందుకు ఇంకా కుదరలేదో ఒకే ఒక్క మాటలో చెప్పేశాడు.
'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్ లో అందరూ ఆ సినిమా గురించే మాట్లాడారు. కానీ త్రివిక్రమ్ మాత్రం సూర్యతో తన సినిమా ఎందుకు ఇంకా కుదరలేదో ఒకే ఒక్క మాటలో చెప్పేశాడు. సూర్యతో సినిమా చేయాలని తనకు ఆలోచన ఉందని, కానీ ఆయనకు నచ్చే కథను ఇప్పటివరకు చెప్పలేకపోయానని ఓపెన్ అయ్యాడు. ఇదొక మామూలు ఈవెంట్ కామెంట్ కాదు. ఇద్దరి మధ్య ఆల్రెడీ కథల గురించి చర్చలు జరిగాయని, నరేషన్ స్థాయి వరకు ప్రయత్నం జరిగిందని ఈ మాటతోనే క్లియర్ గా అర్థమవుతోంది.
తన భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్ అని, అతనితో సినిమా తీయాలని అడగడం రిక్వెస్ట్ కాదని ఏకంగా డిమాండ్ అని త్రివిక్రమ్ సరదాగా చెప్పాడు. ఫన్ యాంగిల్ పక్కన పెడితే ఇందులో ఇంకో అసలు విషయం ఉంది. ఇంత పెద్ద డైరెక్టర్ ఒక స్టార్ హీరోను తన కథతో ఒప్పించలేకపోయానని డైరెక్ట్ గా ఒప్పుకోవడం చిన్న విషయం కాదు. అంటే ఈ భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఇప్పుడున్న ప్రధాన సమస్య డేట్స్ కాదు.. సరైన కథే.
ప్రస్తుతానికి త్రివిక్రమ్ లైనప్ చాలా టైట్ గా ఉంది. వెంకటేష్ తో తీస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47 ఏకే 47' సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ సినిమా చేయనున్నాడు. 'అరవింద సమేత' తర్వాత వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి సూర్యతో ప్రాజెక్ట్ ఇప్పట్లో వెంటనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే లేదు.
సూర్య లైనప్ చూసినా చాలా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' తర్వాత జీతూ మాధవన్ డైరెక్షన్ లో చేసిన సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. దాన్ని ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తర్వాత 'జై భీమ్' డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తో 'సూర్య 48' కూడా అఫీషియల్ గా లాక్ అయింది. దీనికి తోడు లోకేష్ కనగరాజ్ 'రోలెక్స్' కూడా లైన్ లో ఉండటం విశేషం.
సూర్య వేర్వేరు జానర్ల మీద బాగా ఫోకస్ చేసినట్టు ప్రాజెక్ట్స్ చూస్తేనే తెలుస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య మరో సినిమాకు డేట్స్ ఇవ్వాలంటే ముందు కథ బలంగా కనెక్ట్ కావాలి. త్రివిక్రమ్ కూడా అదే పాయింట్ దగ్గర పాస్ కాలేదని స్వయంగా చెప్పేశాడు. ఈవెంట్లలో త్వరలో కలుస్తాం అనకుండా, నచ్చే కథ చెప్పలేకపోయానని త్రివిక్రమ్ రియాలిటీ మాట్లాడటం వల్లే ఈ ప్రాజెక్ట్ మీద అందరికీ ఆసక్తి పెరిగింది.
సూర్య త్రివిక్రమ్ సినిమా ఇప్పుడే వచ్చేస్తుందని చెప్పలేం, అలాగని అసలు ప్రయత్నమే జరగలేదని కూడా అనుకోలేం. మాటల మాంత్రికుడి మాటల ప్రకారం వాళ్లు కథ చెప్పే దశ వరకు వెళ్లారు కానీ, సూర్య నుంచి ఇంకా ఓకే రాలేదు. ఇద్దరూ తమ ప్రాజెక్ట్స్ పూర్తి చేసేలోపు సూర్యకు సరిపోయే కథను త్రివిక్రమ్ లాక్ చేస్తే, చాలా కాలంగా ఊరిస్తున్న ఈ కాంబినేషన్ నిజంగానే పట్టాలెక్కుతుంది.