టాలీవుడ్ కు ఆగస్టు గోల్డెన్ సీజన్‌గా మారుతుందా?

అయితే మరోవైపు ఆగస్టు రిలీజ్ క్యాలెండర్‌లో భారీ రీషఫుల్ జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Update: 2026-05-27 09:50 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. వరుసగా భారీ సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడే రోజులు ఎప్పుడు వస్తాయా అన్న ఎదురుచూపుల్లో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జూన్‌లో రిలీజ్ కు సిద్ధమవుతున్న రామ్ చరణ్ భారీ సినిమా పెద్దిపై ఇండస్ట్రీ మొత్తం ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితేనే బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపిరి వస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ఆగస్టు నెల మాత్రం టాలీవుడ్‌కు గోల్డెన్ సీజన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆగస్టులో వరుస సెలవులు, ఇండిపెండెన్స్ వీక్ లాంగ్ వీకెండ్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనుకూలమైన సీజన్ ఉండటంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఈ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నాని నటిస్తున్న ది ప్యారడైజ్ ఆగస్టు 21న రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, శర్వానంద్ భోగి ఆగస్టు 28న భారీ స్థాయిలో విడుదల కానుంది. మరోవైపు రవితేజ- శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇరుముడి కూడా ఇదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే మరోవైపు ఆగస్టు రిలీజ్ క్యాలెండర్‌లో భారీ రీషఫుల్ జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముందుగా జూలైలో రావాల్సిన ఓ పెద్ద సినిమా ఇప్పుడు ఇండిపెండెన్స్ వీక్‌ను టార్గెట్ చేస్తోందని సమాచారం. అదే సమయంలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు మాత్రం వాయిదా దిశగా అడుగులు వేస్తున్నాయట. ముఖ్యంగా నాని నటిస్తున్న ది ప్యారడైజ్ రిలీజ్‌పై ఇన్‌సైడ్ కొత్త చర్చలు జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్కేల్, పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ కారణంగా సినిమా మరింత ఆలస్యం కావచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఇక సూర్య- వెంకీ అట్లూరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌ విశ్వనాథ్ అండ్ సన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పనులు అనుకున్న వేగంతో ముందుకు సాగడం లేదని, రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముందని సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు చిరంజీవి విశ్వంభర కూడా ఆగస్టులో వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అన్న అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా మేకర్స్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

ఈ వరుస డిలేలు మాత్రం ఎగ్జిబిటర్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఒక పెద్ద సినిమా వెనక్కి వెళ్తే మొత్తం రిలీజ్ క్యాలెండర్ మారిపోతుండటం, చిన్న సినిమాల ప్లానింగ్ కూడా దెబ్బతింటోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సరైన తేదీల్లో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తే ఆగస్టు నిజంగానే టాలీవుడ్‌కు గోల్డెన్ సీజన్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు మాత్రం పెద్ది సినిమా ఫలితంతో పాటు ఆగస్టు రిలీజ్‌ల ఫైనల్ లైనప్‌పైనే ఉంది.

Tags:    

Similar News