ట్రెండీ టాక్: హీరోల‌పై తాప్సీ ప‌న్ను మ‌రోసారి..!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు అంటే కేవలం పాటలకే పరిమితం కావాలనే ధోరణి ఇంకా కొనసాగుతుండటంపై నటి తాప్సీ పన్ను తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.;

Update: 2026-03-21 06:31 GMT

సినిమా పరిశ్రమలో హీరోయిన్లు అంటే కేవలం పాటలకే పరిమితం కావాలనే ధోరణి ఇంకా కొనసాగుతుండటంపై నటి తాప్సీ పన్ను తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కథకు ప్రాధాన్యమిచ్చి తమ పాత్ర పరిధి ఎంత ఉన్నా నటించే జెన్యూన్ హీరోలు ప్రస్తుతం లేరని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటే నటించేందుకు చిన్న హీరోలు కూడా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ హీరోయిన్ హైలైట్ అయితే తమ ఇమేజ్ దెబ్బతింటుందనే అభద్రతాభావం హీరోలలో గూడుకట్టుకుని ఉందని ఆమె సూటిగా విమర్శించారు.

నేటి తరంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తర్వాత అంత గట్టిగా తన గొంతు వినిపిస్తున్న నటిగా తాప్సీ గుర్తింపు పొందారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తన మనస్తత్వానికి తగ్గట్టుగానే నాయికా ప్రాధాన్యత ఉన్న స్క్రిప్టులనే ఎంపిక చేసుకుంటున్నారు. పింక్, నామ్ షబానా వంటి సినిమాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. చాలా మంది కథానాయికలు హీరోలను ముఖస్తుతి కోసం పొగుడుతూ అవకాశాలు దక్కించుకోవాలని చూస్తుంటే తాప్సీ మాత్రం అందుకు భిన్నంగా హీరోల ఆలోచనా విధానంపై `దురంధర ఎటాక్` చేస్తున్నారు.

మంచి కథలు రావాలంటే హీరోలు పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రావాలని తాప్సీ పిలుపునిచ్చారు. కథానాయికలు కేవలం గ్లామర్ కోసమే ఉండాలనే పాత ఆలోచనలను వీడి కథకు ఏది అవసరమో దానిని గౌరవించాలని తాప్సీ డిమాండ్ చేశారు. సినిమాలో హీరోయిన్ పాత్ర బలంగా ఉంటే హీరోల ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందో అనే భయంతో కథలను తిరస్కరించడం వల్ల అద్భుతమైన స్క్రిప్టులు మరుగున పడిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. తన పాత్ర నిడివి కంటే కథ గొప్పతనాన్ని చూసే హీరోల అవసరం ఇండస్ట్రీకి ఎంతైనా ఉందని డ్యాషింగ్ గా మాట్లాడారు.

ఇలా హీరోసామ్యాన్ని నిరంతరం ప్రశ్నించడం వల్ల తాప్సీకి అగ్ర హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గాయా? అనే చర్చ కూడా సినీ వర్గాల్లో ప్ర‌స్తుతం సాగుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర కేవలం పాటలకే పరిమితం కావాలని కోరుకుంటారు. కానీ తాప్సీ వంటి నటి తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే అటువంటి సినిమాలను తిరస్కరించడం వల్ల పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా త‌గ్గేదేలే.. అంటూ తన పంథాను మార్చుకోకుండా నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాల కోస‌మే తాప్సీ వేచి చూస్తున్నారు.

తాప్సీ చేస్తున్న ఈ పోరాటం భవిష్యత్తులో సినిమా మేకింగ్‌లో మార్పు తీసుకువస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నాయికాప్ర‌ధాన చిత్రాల్లో నటించడానికి హీరోలు కూడా మనసు మార్చుకున్నప్పుడే పరిశ్రమలో సమతుల్యత ఏర్పడుతుందనేది తాప్సీ భావన. అగ్ర హీరోల సరసన నటించడం కంటే తనకు గుర్తింపు తెచ్చే పాత్రలే ముఖ్యమని భావిస్తూ తాప్సీ కొన్నేళ్లుగా కెరీర్ సాగిస్తున్నారు. మరి తాప్సీ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు మన హీరోలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News