30 ఏజ్‌లో అందుకు ప‌నికిరాన‌ని నిజాయితీగా ఒప్పుకున్న న‌టి!

గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిరంతరం వార్తల్లో నిలిచే కథానాయికలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉండటం సహజం.

Update: 2026-06-08 00:30 GMT

గ్లామర్ ప్రపంచంలో ఉంటూ నిరంతరం వార్తల్లో నిలిచే కథానాయికలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉండటం సహజం. అయితే బాలీవుడ్ - టాలీవుడ్‌లలో తనదైన ముద్ర వేసిన నటి తాప్సీ పన్ను మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదిక‌లకు, ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. నిరంతర ట్రోలింగ్, ప్రతికూల వాతావరణం , అనవసరపు వివాదాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి కంటే తన మనశ్శాంతి అత్యంత విలువైనదని భావించడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాప్సీ ఇటీవల వెల్లడించారు. నెగెటివిటీకి దూరంగా ఉంటూ.. తన వ్యక్తిగత జీవితాన్ని.. ప్రశాంతతను కాపాడుకోవడానికే ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నార‌ట‌.

తాప్సీ తన కెరీర్ ఆరంభంలో టాలీవుడ్‌లో వరుసగా గ్లామరస్ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో త‌న‌కు అటువంటి కమర్షియల్, గ్లామరస్ పాత్రలు చేసే అవకాశాలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ భామ‌ బాలీవుడ్‌కు మారిన తర్వాత ఎంచుకున్న కథలేనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పింక్, బాద్లా, థప్పడ్ వంటి సినిమాలతో తాప్సీ ఒక పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌గా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఈ బలమైన ఇమేజ్ కారణంగా టాలీవుడ్ మేకర్స్ కేవలం పాటలు, కొన్ని సీన్లకే పరిమితమయ్యే రెగ్యులర్ గ్లామర్ పాత్రల కోసం త‌న‌ను సంప్రదించడానికి వెనుకాడటం.. పైగా టాలీవుడ్‌లో కొత్త తరం నటీమణుల పోటీ పెరగడం కూడా దీనికి తోడైంది.

ఇటీవ‌ల‌ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోను వివాహం చేసుకున్న తాప్సీ పెళ్లి తర్వాత తన కెరీర్ ప్లానింగ్‌ను మరింత స్పష్టంగా మార్చుకున్నారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక క్యారెక్టర్ రోల్స్ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలను తిప్పికొడుతూ.. తాప్సీ కేవలం సోలో లీడ్ లేదా నాయికా ప్రధాన పాత్రలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కథను తన భుజాలపై నడిపించగల సత్తా ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. ఒక నటిగా తనకున్న మార్కెట్ వాల్యూను... నటనలోని వైవిధ్యాన్ని కాపాడుకుంటూ.. కేవలం కథానాయకుడి వెనుక నిలబడే పాత్రల కంటే కథకు మూలస్తంభంగా నిలిచే క్యారెక్టర్లనే పెళ్లి తర్వాత ఓకే చెబుతోంది.

ఈ క్రమంలోనే తాప్సీ నటిస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ `గాంధారి` ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. కథాంశం ప్రకారం ఇందులో తాప్సీ ఒక అంకితభావం గల తల్లి పాత్రలో కనిపిస్తారని.. తన బిడ్డను రక్షించుకోవడానికి ఒక తల్లి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుంది అనే పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానున్న ఈ చిత్రం తాప్సీ కెరీర్‌లో మరో విభిన్నమైన, యాక్షన్ ఓరియెంటెడ్ సోలో హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడంతో లభించిన మానసిక ప్రశాంతతను తాప్సీ తన వృత్తిగత జీవితంపై సానుకూలంగా మళ్లించినట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమలో గ్లామర్ పాత్రలకు దూరమైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారామె. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా `గాంధారి` వంటి వైవిధ్యమైన నాయికా ప్రధాన చిత్రాలతో దూసుకుపోతూ..నేటితరం కథానాయికలకు తాప్సీ ఒక కొత్త మార్గదర్శిగా నిలుస్తున్నారు.

హీరోల విష‌యంలో అలా జ‌ర‌గదు:

తాప్సీ రొమాంటిక్ జాన‌ర్ల‌లో న‌టించ‌క‌పోవ‌డానికి వ‌య‌సు అడ్డంకి అని అంగీక‌రించ‌డం కొస‌మెరుపు. 20ల‌లో కెరీర్ ప్రారంభిస్తే, ఇప్పుడు 30 వ‌చ్చేసింది. ఈ ఏజ్ లో రొమాంటిక్ కామెడీలు చేయ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డింది. అయితే హీరోల విష‌యంలో ఇది వ‌ర్తించ‌ద‌ని కూడా పేర్కొంది. దీనిని బ‌ట్టి ఏజ్డ్ హీరోయిన్ల‌ను రొమాంటిక్ జాన‌ర్ సినిమాల‌కు హీరోలు ఎంపిక చేయ‌ర‌ని అర్థం చేసుకోవ‌చ్చు. పెరుగుతున్న కాంపిటీష‌న్ వ‌ల్లే తాప్సీ లాంటి వారికి అవ‌కాశం లేదు!

Tags:    

Similar News