ఓటీటీ కంటెంట్ ఢమాల్: రైటర్‌ని గుర్తించకపోతే ప్రేక్ష‌కుడికే శాపం!

భారతీయ ఓటీటీ రంగం ప్రస్తుతం ఒక వింతైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రారంభ దినాల్లో (2018-2021 మధ్య) సెన్సార్‌షిప్ లేకపోవడంతో రక్తపాతం, బూతులు, బోల్డ్ సీన్స్ -గ్యాంగ్‌స్టర్ కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి.

Update: 2026-06-19 19:30 GMT

భారతీయ ఓటీటీ రంగం ప్రస్తుతం ఒక వింతైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రారంభ దినాల్లో (2018-2021 మధ్య) సెన్సార్‌షిప్ లేకపోవడంతో రక్తపాతం, బూతులు, బోల్డ్ సీన్స్ -గ్యాంగ్‌స్టర్ కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. కానీ గత ఐదేళ్లుగా ప్రతి రెండో సిరీస్ ఇదే రొటీన్ ఫార్ములాతో వస్తుండటంతో వీక్షకులకు `కంటెంట్ ఫెటీగ్` (ఒకే రకమైన రొటీన్ కంటెంట్ చూసి బోర్ కొట్టడం) వచ్చేసింది. మరోవైపు అంతర్జాతీయంగా వచ్చిన స్క్విడ్ గేమ్, మనీ హైస్ట్, డార్క్, సక్సెషన్ వంటి విభిన్న జానర్ల షోలను సబ్‌టైటిల్స్ లేదా డబ్బింగ్ ద్వారా ఆదరిస్తున్న మన ప్రేక్షకులు సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ డ్రామా, మిస్టరీ వంటి సరికొత్త జోనర్లను రుచి చూశారు. కాబట్టి కథ లేకుండా కేవలం బోల్డ్‌నెస్‌ను, క్రైమ్‌ను నమ్ముకుంటే ప్రేక్షకులు ఇప్పుడు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు.

డిజిటల్ వేదిక‌లలో కొత్త ఐడియాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఆలోచనా శక్తి లోపం కాదు.. అలాగని కేవలం బడ్జెట్ పరిమితులూ కావు... ఇండస్ట్రీలోని సిస్టమిక్ లోపాలే ఇందుకు కారణం. మన డిజిటల్ రైటర్స్‌కు అద్భుతమైన ఆలోచనలు ఉన్నా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కార్పొరేట్ నిర్వాహకులు ఒక కొత్త ఐడియాను నమ్మడానికి భయపడుతున్నారు. గతంలో హిట్టయిన మిర్జాపూర్ లేదా సేక్రెడ్ గేమ్స్ లాంటి ఫార్ములాలను మైండ్‌లో పెట్టుకుని, రైటర్స్‌ను కూడా అలాంటి సేఫ్ జోన్ కథలే రాయమని ఒత్తిడి తెస్తుంటారు. నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్‌లు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా `సేఫ్ గేమ్` ఆడాలనుకోవడం వల్ల ఎన్నో వినూత్నమైన ఆలోచనలు స్క్రిప్ట్ దశలోనే ఆగిపోతున్నాయి.

ఈ దుస్థితికి రైటర్స్‌కు ఇచ్చే పారితోషికం, గుర్తింపులో ఉన్న వివక్షే మరో ముఖ్య కారణం. హాలీవుడ్‌లో రైటర్స్‌కు అత్యధిక ప్రాధాన్యత, బడ్జెట్‌లో పెద్ద వాటా ఇస్తూ `రైటర్స్ రూమ్స్` బలంగా నిర్వహిస్తారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ దర్శకుడికో, నటీనటులకో ఇచ్చే ప్రాధాన్యత, బడ్జెట్..... కథ రాసే రైటర్‌కు ఇవ్వడం లేదు. సరైన ఇన్సెంటివ్స్ లేనప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ రీసెర్చ్ చేయడం కష్టమవుతుంది. రచయితలు విస్తృతంగా పర్యటించి, లైవ్ లొకేషన్లకు వెళ్లి పరిశీలించి రాయడానికి బదులు.. తక్కువ పారితోషికాల‌ వల్ల నాలుగు గోడల మధ్య కూర్చుని, టీవీలు, యూట్యూబులు చూసి కథలు వండటం వల్లే కంటెంట్ నాణ్యత దారుణంగా పడిపోతోంది.

అంతేకాకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే హాలీవుడ్‌ను బ్లైండ్‌గా కాపీ కొట్టడం కాదు.. మన కథల్లోని `నేటివిటీ` (స్థానికత)ని అంతర్జాతీయ ప్రమాణాలతో చెప్పగలగాలి. మన ఇతిహాసాలు.. సామాజిక వైవిధ్యం... చారిత్రక అంశాలలో అద్భుతమైన డ్రామా ఉన్నా.. వెస్ట్రన్ మేకింగ్‌ను అనుకరించడం వల్ల మన రైటర్స్ ఇటు కమర్షియల్‌గానూ, అటు గ్లోబల్‌గానూ కాకుండా మధ్యలో ఉండిపోతున్నారు. ప్రేక్షకులు మారినా మేకర్స్ ఇంకా పాత ఆలోచనల్లోనే ఉండటం వల్లే 2026 ఓటీటీ సంక్షోభం తలెత్తింది. ఇది ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక. రైటర్‌ని గుర్తించకపోతే చివరికి నాసిరకం కంటెంట్ చూడాల్సి రావడం ప్రేక్షకులకే శాపంగా మారుతుంది. అందుకే మునుముందు రోజుల్లో స్టార్ల కంటే `రైటింగ్ - యూనిక్ కాన్సెప్ట్`కే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ పతనానికి కారకులెవ‌రు?

2026లో ఓటీటీ కంటెంట్ భారీగా విఫలమవడానికి ప్రధాన కారణం రైటర్లకు కథపై పట్టు లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కథ, కథనాల్లో స్పష్టమైన లోపాలు ఉండటం... ఎంచుకునే కంటెంట్‌లో ఏమాత్రం పస లేకపోవడం, పాత మూస ఆలోచనలతో రొటీన్ కథలను నమ్ముకోవడమే ఈ వైఫల్యాలకు దారితీసింద‌ని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు నైతికంగా సంక్లిష్టమైన పాత్రలు, ఉత్కంఠభరితమైన కథనంతో విశేష ఆదరణ పొందిన `ఉందేఖి` ఫ్రాంచైజీ, తాజాగా వచ్చిన `ఉందేఖి 4`సీజన్‌లో ఆ పట్టును నిలబెట్టుకోలేక పూర్తిగా చతికిలపడింది. మునుపటి సీజన్ల స్థాయి ఉత్కంఠను, అనూహ్య ఘ‌ట‌న‌ల‌ను రీడిఫైన్ చేయ‌డంలో ఇది ఘోరంగా విఫలమైందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు... ఇటీవల విడుదలైన `ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2`, కరిష్మా కపూర్ నటించిన `బ్రౌన్`తో పాటు `లుక్కే`, `మా కా సమ్` వంటి సిరీస్‌లు, ఇటీవ‌లి చాలా సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేక పూర్తిగా తేలిపోయాయి. అయితే వీట‌న్నిటిలో ర‌చనా లోపమే స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. తూతూ మంత్రంగా రాసిన స్క్రిప్టుల‌కు, మ‌న‌సు పెట్టి రాసిన స్క్రిప్టుల‌కు తేడా ఏంటో తెలిసిపోయింది.

ప్రస్తుత తరం ప్రేక్షకులు చాలా అప్‌డేట్ అయ్యారు. వారు కేవలం ప్రాంతీయ కంటెంట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ సినిమాలు, హాలీవుడ్, కొరియన్ డ్రామాలతో పాటు గ్రీకు పురాణాలు, ప్రపంచ చరిత్రపై కూడా అవగాహన పెంచుకుంటున్నారు. ఇంతటి గ్లోబల్ నాలెడ్జ్ ఉన్న ప్రేక్షకులకు ఇంకా పాతకాలపు రెగ్యులర్ స్క్రీన్‌ప్లేలతో, రొటీన్ కంటెంట్‌తో సినిమాలు చూపిస్తామంటే వారు ఎంతమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమయంలో వైవిధ్యమైన, అద్భుతమైన కంటెంట్ ఎప్పుడు పుడుతుంది? అంటే... భారతదేశంలో రైటర్లకు సరైన గుర్తింపు దక్కినప్పుడు, వారి ప్రతిభను గౌరవించినప్పుడు మాత్రమే. చిత్ర పరిశ్రమలో రచయితల కోసం కేటాయించే బడ్జెట్లను పెంచి, వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఓటీటీ లేదా సినిమా అనే ప్రపంచంలో మళ్లీ అద్భుతమైన కంటెంట్ సాధ్యమవుతుంది.

Tags:    

Similar News