సీనియర్ డైరెక్టర్ తో మూవీ.. నాగి డెడికేషన్ ఎంతలా ఉందంటే?
టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ గా రూపొందుతున్న ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ గా రూపొందుతున్న ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న సినిమా SSR61పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ వీడియో ఆ ప్రాజెక్ట్ పై ఆసక్తిని మరింత పెంచింది.
అందులో సింగీతం శ్రీనివాసరావు ఆ కథను దాదాపు 40 ఏళ్ల క్రితమే రాసుకున్నారని తెలిపారు. అప్పటినుంచి ఎన్నో ప్రయత్నాలు చేసినా సినిమా రూపం దాల్చలేదు. చాలా మంది హీరోలు, నిర్మాతలను కలిసినా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అయితే చివరికి నాగ్ అశ్విన్ నిర్మాతగా ముందుకు రావడంతో తన కల నిజమవుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో సినిమా షూటింగ్ జరుగుతోంది. కల్కి 2898 AD చిత్రానికి వేసిన సెట్స్ కు సమీపంలో ప్రత్యేకంగా మరో సెట్ వేసి చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. సెట్స్ పై నాగ్ అశ్విన్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ వీడియోలో ఆయన డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది సింగీతం శ్రీనివాసరావు కెరీర్ లో 61వ చిత్రం కాగా.. త్వరలోనే అధికారిక టైటిల్, టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సినిమా పక్కా రూరల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సింగీతం ప్రత్యేకమైన హాస్యం, భావోద్వేగాలు ఇందులో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సింగీతం మళ్లీ దర్శకత్వం వహించడం విశేషం.
90 దాటిన వయసులోనూ ఆయన సెట్స్ లో చురుగ్గా పనిచేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఉత్సాహం చూసి సినీ పరిశ్రమ మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. ఇది సింగీతానికి కేవలం మరో సినిమా కాకుండా, ఎన్నాళ్లుగానో కలగన్న డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. క్లాసిక్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన సింగీతం, మోడ్రన్ శైలిలో సినిమాలు తీసే నాగి కలిసి పనిచేయడం విశేషమని చెప్పాలి.
పూజా కార్యక్రమంతో ఆ సినిమాను ఇటీవల ప్రారంభించగా, అనౌన్స్మెంట్ వీడియోలో సింగీతం గత చిత్రాల జ్ఞాపకాలు చూపిస్తూ సింగీతం సినీ ప్రయాణాన్ని గుర్తు చేశారు. పుష్పక విమానం, ఆదిత్య 369 వంటి క్లాసిక్స్ ను మరోసారి గుర్తు చేశారు. మొత్తానికి, అనుభవం, కొత్త ఆలోచనలు కలిసిన ఆ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. SSR61 ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. సింగీతం ఈ వయసులోనూ ఆ సినిమాను పూర్తి చేసి విజయం సాధిస్తే, అది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.