ఆమెను తప్పించడంతో రూ.15 కోట్లు మిగులు!!
స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకునే తప్పుకుందనే వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమాలోకి తృప్తి దిమ్రిని తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.;
ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో సినిమాను ప్రకటించి చాలా కాలం అయింది. 'యానిమల్' సినిమా సూపర్ హిట్ కావడంతో స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సందీప్ వంగ దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. యానిమల్ సినిమాతో దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన సందీప్ వంగ తన తదుపరి సినిమాతో అంతకు మించి రాబట్టే విధంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్‌ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించే విధంగా స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం దీపికా పదుకునేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించారు.
స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకునే తప్పుకుందనే వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమాలోకి తృప్తి దిమ్రిని తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీపికా పదుకునేను తొలగించడంకు కారణం ఏంటి అనే విషయం గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా ఆమె పారితోషికంతో పాటు ఇతర అలవెన్స్‌ల విషయంలో డిమాండ్ ఎక్కువ చేసిందని, అందుకే ఆమెను తొలగించారని తెలుస్తోంది. దీపికా ఏకంగా 20 కోట్ల పారితోషికం, దాదాపుగా రెండున్నర కోట్ల అదనపు ఖర్చులను డిమాండ్ చేసిందని తెలుస్తోంది. దాంతో ఆమెను తప్పించడమే మంచి నిర్ణయం అని చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం భావించారని సమాచారం అందుతోంది.
బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమాలో తృప్తి నటించేందుకు గాను దాదాపుగా రూ.5 కోట్ల పారితోషికం అందుకుంటుంది. యానిమల్ సినిమాతో పోల్చితే ఈ పారితోషికం చాలా చాలా ఎక్కువ. పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ భారీ స్థాయి పారితోషికంను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ సందీప్ రెడ్డి వంగ రాజీ పడకుండా దీపికాను తీసుకుని ఉంటే కచ్చితంగా బడ్జెట్ అధనంగా రూ.15 నుంచి 17 కోట్లు పెరిగి ఉండేది. ఇప్పుడు ఆ మొత్తంను మేకింగ్ కోసం ఖర్చు చేయవచ్చు లేదా నిర్మాతకు మిగులు అనే అభిప్రాయంను పలువురు సినీ వర్గాల వారు, మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్స్ పారితోషికం విషయంలో ఒకప్పుడు కాస్త తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ సినిమా అనగానే దీపికా పారితోషికం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి సినిమాకు సైతం భారీ మొత్తంలో డిమాండ్ చేసిందని, సదరు నిర్మాణ సంస్థ అందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో తప్పనిసరిగా దీపికాను తీసుకోవాల్సి వచ్చింది. కానీ స్పిరిట్ సినిమా విషయంలో హీరోయిన్‌గా దీపికా అవసరం లేదని సందీప్ భావించి ఉంటాడు, అందుకే త్రిప్తిని రంగంలోకి దించి ఏకంగా రూ.15 కోట్లను మిగిల్చాడు అని తెలుస్తోంది.