భార్య భర్తలైనా సెట్స్ లో సహచరులుగానే!
ఒకరి నటనపై ఒకరు విమర్శనాత్మక అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా పాత్రలను మరింత మెరుగు పరుచుకోవడానికి ఈ ప్రయాణం ఎంతగానో దోహదపడిందని తెలిపారు.
పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేతా త్రిపాఠి శర్మ. తన భర్త చైతన్య శర్మ తో కలిసి సరికొత్త థియేటర్ నాటకం `ఎక్స్‌టర్నల్ అఫైర్స్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇప్పుడు రంగస్థలంపై కూడా జంటగా నటించి అలరించడానికి సిద్ధమయ్యారు. ఒకే ప్రాజెక్ట్‌లో భార్యాభర్తలుగా కలిసి పనిచేయడం.. అది ప్రత్యక్షంగా ప్రేక్షకుల ముందు ప్రదర్శించే నాటకంలో కావడం ఇద్దరికీ సరికొత్త అనుభవం. ఈ నాటకంలో తమ మధ్య ఉన్న కెమిస్ట్రీ.. కలిసి పనిచేయడంపై శ్వేతా త్రిపాఠి తన మనసులోని భావాలను పంచుకున్నారు.
నిజ జీవిత భాగస్వామితో కలిసి నటించడం ఒక రకంగా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పరస్పరం ఉన్న అవగాహన, నమ్మకం వల్ల పాత్రల్లో లీనం కావడం సులువవుతుందని తెర వెనుక ఉన్న ఆ బంధమే వేదికపై వారి నటనకు మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. అయితే భార్యాభర్తలుగా వృత్తిపరమైన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం సవాలేనని శ్వేతా అంగీకరించారు. సెట్స్‌పై లేదా రిహార్సల్స్ సమయంలో భార్యాభర్తలం అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం సహనటులుగా మాత్రమే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఒకరి నటనపై ఒకరు విమర్శనాత్మక అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా పాత్రలను మరింత మెరుగు పరుచుకోవడానికి ఈ ప్రయాణం ఎంతగానో దోహదపడిందని తెలిపారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌ల వంటి విభిన్న మాధ్యమాల్లో బిజీగా ఉన్నప్పటికీ రియల్-టైమ్ ఆర్ట్ అయిన థియేటర్ పట్ల తమకున్న ప్రేమను జంట చాటుకుంది. కెమెరా ముందు నటించడానికి.. ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందనను చూస్తూ స్టేజ్‌పై నటించడానికి చాలా వ్యత్యాసం ఉంటుందని శ్వేతా వివరించారు. థియేటర్ నాటకాలు నటుడిగా తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి .. నటనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి అద్భుతమైన వేదికగా ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
`ఎక్స్‌టర్నల్ అఫైర్స్` నాటకం ఇతివృత్తం ప్రస్తుత ఆధునిక కాలంలో బంధాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం ..మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను ప్రతిబింబించేలా సాగుతుంది. ఈ నాటకంలో సమకాలీన సమాజంలోని వైవాహిక జీవితాలు, వాటిలో ఎదురయ్యే సవాళ్లను హాస్యం , భావోద్వేగాల మేళవింపుతో ఆవిష్కరిస్తున్నారు. ఈ పాత్రలు నేటి తరం జంటలకు ఎంతో సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
చివరిగా శ్వేతా త్రిపాఠి- చైతన్య శర్మల కలయిక వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా కళాత్మక రంగంలోనూ ఒక విజయవంతమైన భాగస్వామ్యంగా నిలుస్తుందని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది. వెండితెర ..డిజిటల్ స్క్రీన్‌లపై నటీనటుల కెమిస్ట్రీని చూసే ప్రేక్షకులకు రంగస్థలంపై ఈ జంట అందించే ప్రత్యక్ష ప్రదర్శన ఓ సరికొత్త వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. వీరి ప్రయాణం కళాకారులుగా వారి పరిణతికి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.