RRRతో మారిన ప్రపంచ సినిమా లెక్కలు.. ఇండియన్ మేకర్స్‌కు కొత్త దారి!

ఈ మార్పులో ఆర్ఆర్ఆర్ కీలక మలుపుగా నిలిచిందనే అభిప్రాయం అంతర్జాతీయ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Update: 2026-07-20 05:50 GMT

ఒకప్పుడు భారతీయ సినిమాలు విదేశాల్లో ప్రధానంగా ప్రవాస భారతీయులకే పరిమితమయ్యేవి. భారీ క‌లెక్ష‌న్లు సాధించినా, ప్రపంచ సినీ మార్కెట్‌లో వాటి ఇంపాక్ట్ అంతగా కనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ఆవిర్భావం, ప్రపంచవ్యాప్తంగా ఆడియ‌న్స్ అభిరుచిలో వచ్చిన మార్పులు ఇండియ‌న్ సినిమాల‌కు కొత్త అవకాశాలను తెరిచాయి. ఈ మార్పులో ఆర్ఆర్ఆర్ కీలక మలుపుగా నిలిచిందనే అభిప్రాయం అంతర్జాతీయ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికాలో సాధించిన స‌క్సెస్ తో హాలీవుడ్ దృష్టి ఇండియ‌న్ సినిమాల వైపు మరింతగా మళ్లింది. కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు, ఆడియ‌న్స్ రెస్పాన్స్, విమర్శకుల ప్రశంసలు, ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ వరకు ఈ సినిమా జ‌ర్నీ ఇండియ‌న్ స్టోరీస్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని నిరూపించింది. దీంతో ఇండియ‌న్ సినిమాలు ఇక ప్రాంతీయ భాషలకు పరిమితం కావనే అభిప్రాయం బలపడింది.

ఈ స‌క్సెస్ తో మరో ఆసక్తికరమైన మార్పు కూడా కనిపిస్తోంది. గతంలో విదేశీ మార్కెట్‌ను అదనపు ఆదాయ వనరుగా చూసిన నిర్మాతలు, ఇప్పుడు రిలీజ్‌కు ముందే ఇంట‌ర్నేష‌నల్ ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీల‌ను రూపొందిస్తున్నారు. అమెరికా, యూరప్, జపాన్, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో స్పెష‌ల్ ప్రీమియర్లు, మీడియా ఇంటర్వ్యూలు, ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్స్, సోషల్ మీడియా క్యాంపైన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రపంచ సినీ పరిశ్రమను పరిశీలించే నిపుణుల అభిప్రాయం కూడా ఇదే. సినిమా స‌క్సెస్ కు కేవ‌లం మంచి క‌థ మాత్రమే సరిపోదు. ఆ సినిమాను సరైన మార్కెట్‌కు, సరైన సమయంలో, సరైన విధంగా తీసుకెళ్లే స్ట్రాట‌జీ కూడా అంతే కీలకం. గ్లోబల్ మార్కెటింగ్ ఇప్పుడు సినిమా స‌క్సెస్ ను నిర్ణయించే ప్రధాన అంశాల్లో ఒకటిగా మారింది. కంటెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, ఇంట‌ర్నేష‌న‌ల్ ఆడియ‌న్స్ వ‌ర‌కు వరకు అది చేరకపోతే అవకాశాలు పరిమితంగానే మిగిలిపోతాయి. ఇదే కారణంగా ఇండియ‌న్ మేక‌ర్స్ ఇప్పుడు విదేశీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను విస్తరించడంపై దృష్టి పెడుతున్నారు. స్థానిక భాషల్లో సబ్‌టైటిల్స్, డబ్బింగ్, డిజిటల్ ప్రమోషన్స్, అంతర్జాతీయ మీడియాతో భాగస్వామ్యాలు వంటి అంశాలు రిలీజ్ ప్లాన్ లో భాగమవుతున్నాయి. గతంతో పోలిస్తే మార్కెటింగ్‌కు కేటాయించే బడ్జెట్ కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత కల్కి 2898ఏడీ, పుష్ప2, కాంతార, హనుమాన్ వంటి సినిమాలు కూడా విదేశీ మార్కెట్లలో విశేష ఆదరణ పొందాయి. భాషతో సంబంధం లేకుండా ఆడియ‌న్స్ ను ఆకట్టుకునే కథలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభిస్తుందనే నమ్మకం మరింత బలపడింది. దీంతో ఇండియ‌న్ సినిమా ఇప్పుడు కేవలం దేశీయ బాక్సాఫీస్‌పైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడుతోంది. ప్ర‌ముఖ హాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ కూడా ఇదే మాట చెప్తున్నారు. గ‌తంలో ఇండియ‌న్ సినిమాల డిస్ట్రిబ్యూష‌న్ విధాన‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. వివిధ దేశాల సినీ ఇండ‌స్ట్రీలు త‌మ త‌మ ప‌రిధిలోనే ప‌నిచేయ‌డంతో, అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకునే దిశగా తగిన స్థాయిలో దృష్టి పెట్టలేదని నోలన్ అన్నారు. నోల‌న్ చెప్పిన దాన్ని బ‌ట్టి మ‌రియు ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న దాని ప్ర‌కారం వ‌ర‌ల్డ్ ఆడియ‌న్స్ ను చేరుకోవాలంటే మంచి కథతో పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ మార్కెటింగ్, ప్రణాళికాబద్ధమైన విడుదల, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా అవసరం. ఇప్పుడు ఇండియ‌న్ సినిమాల‌కు గ్లోబ‌ల్ మార్కెట్ త‌లుపులు తెరుచుకున్నాయి. వాటిని మరింత విస్తరించుకోవడం నిర్మాతలు, దర్శకులు అనుసరించే వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News