ఈ స్టార్ హీరోని కాపాడేది ఎవరు?
ఇటీవలి కాలంలో పూర్తిగా ఫ్లాపుల్లో మునిగిన బాలీవుడ్ హీరోలను కాపాడేందుకు దక్షిణాది దర్శకుడు సందీప్ వంగా సహకరించాడు.;
ఇటీవలి కాలంలో పూర్తిగా ఫ్లాపుల్లో మునిగిన బాలీవుడ్ హీరోలను కాపాడేందుకు దక్షిణాది దర్శకుడు సందీప్ వంగా సహకరించాడు. షాహిద్ కపూర్ కి కబీర్ సింగ్, రణబీర్ కపూర్ కి యానిమల్ లేనప్పుడు సన్నివేశం ఎలా ఉందో చూసాం. ఆ ఇద్దరూ నిండా ఫ్లాపుల్లో మునిగి నీరసపడిపోయిన టైమ్ లో విధి సందీప్ వంగాను పరిచయం చేసింది. ఫ్లాపుల నుంచి బయటపడేందుకు సందీప్ వంగా తనదైన మార్గాన్ని అనుసరించాడు. చివరికి ఆ ఇద్దరు హీరోలు కెరీర్ పరంగా చాలా హ్యాపీ.
అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఇద్దరు బాలీవుడ్ దర్శకులనే నమ్మాడు రణ్ వీర్ సింగ్. అతడు చాలా కాలంగా హిట్టు అన్నదే లేక దిగాలు పడిపోయాడు. సర్కస్, 83, జయేష్‌భాయ్ జోర్దార్ ఇవన్నీ ఫ్లాపులు. సింగం 3లో అతడి పాత్ర ఆకట్టుకున్నా అది అతిథి పాత్ర మాత్రమే. అందుకే ఇప్పుడు అతడికి సోలో గా బ్లాక్ బస్టర్ హిట్టు పడాల్సి ఉంది.
అయితే అతడిని అన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు యూరి ఫేం ఆదిత్య ధర్ చాలా శ్రమిస్తున్నాడు. బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుడిగా ఆదిత్యధర్ కి గుర్తింపు ఉంది. అందువల్ల రణవీర్ ఆశలన్నీ అతడిపైనే. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో దురంధర్ చిత్రీకరణలో ఉంది. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఆకట్టుకుంటోంది. రణ్ వీర్ కెరీర్ లో ఇది ఒక వివాదాస్పద చిత్రం కానుందని భావిస్తున్నారు. ఇంతకుముందు లీకైన ఫోటోలు, వీడియోలు కూడా ఎంతగానో ఆకర్షించాయి. పైగా ఒక నిజజీవిత హీరో కథను ఆదిత్యథర్ తెరపైకి తెస్తుండడంతో దురంధర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు డాన్ ఫ్రాంఛైజీలో మూడో భాగంలో రణ్ వీర్ అవకాశం అందుకోవడం నిజంగా అందరికీ షాకిచ్చింది. షారూఖ్ ని కాకుండా, ఫర్హాన్ అక్తర్ రణ్ వీర్ ని డాన్ గా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. ఫర్హాన్ బాలీవుడ్ లో ఫైనెస్ట్ డైరెక్టర్ కం నిర్మాత. అతడు డాన్, డాన్ 2 చిత్రాలను బ్లాక్ బస్టర్లుగా మలిచాడు. అయితే షారూఖ్ కాకుండా డాన్ పాత్రలో రణ్ వీర్ ని రిసీవ్ చేసుకునేందుకు ఆడియెన్ ఆసక్తిగా లేకపోవడం పెద్ద మైనస్ కాబోతోంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కొని, రణ్ వీర్ తనదైన ఎనర్జీ- నటనా బ్రిలియన్సీ తో ప్రాజెక్ట్ ని మరో లెవల్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాన్ 3లో ప్రియాంక చోప్రా లాంటి స్టార్ లేకపోవడం కూడా మైనస్ కాబోతోంది. ఆ స్థానాన్ని కృతి సనోన్ భర్తీ చేయగలదా లేదా? అన్నది కూడా వేచి చూడాలి. `డాన్ 3` రణ్ వీర్ కి ప్లస్ అవుతుందా లేదా ట్రోలర్లకు చిక్కుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.