25 ఏళ్ల తర్వాతే పూర్తి చేసిన రహస్యం!

అయితే పరమహంస యోగానంద రాసిన `ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి` పుస్తకాన్ని ఆయన 25 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే?;

Update: 2026-04-22 03:44 GMT

భారతీయ చలనచిత్ర రంగంలో అప్రతిహతమైన స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితంలో ఆధ్యాత్మికతకు ప్ర‌త్యేక‌ స్థానముంది. వెండితెరపై ర‌జ‌నీ విన్యాసాలు కోట్లాది మందిని అలరిస్తే, తెర వెనుక ఆయన గడిపే ప్రశాంత జీవితం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా ర‌జ‌నీకాంత్ జీవితాన్ని మలుపు తిప్పిన ఓ పుస్తకం గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అదే `ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి`. ఈ పుస్తకాన్ని కొన్న పాతికేళ్ల‌ తర్వాత చ‌ద‌వ‌డం విశేషం. రజనీకాంత్‌కు పుస్తకాలు చదవడం అనే అలవాటు ఒక రోజులో వచ్చింది కాదు.

రామకృష్ణ ఆశ్రమం ప్రభావంతో ఆయనకు పఠనం పట్ల ఆసక్తి పెరిగింది. కెరీర్ ప్రారంభంలో మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్న సమయంలో ఆశ్రమ వాతావరణం , అక్కడి ఆధ్యాత్మిక గ్రంథాలు ర‌జ‌నీను ఎంతగానో ప్రభావి తం చేశాయి. అప్పటి నుండి రజనీకాంత్ స్క్రిప్ట్‌లకే పరిమితం కాకుండా, లోతైన జీవన సత్యాలను బోధించే పుస్తకాలను చదవడం అలవాటుగా మార్చుకున్నారు.

అయితే పరమహంస యోగానంద రాసిన `ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి` పుస్తకాన్ని ఆయన 25 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే? ఆ పుస్తకం ఆయన దగ్గరే ఉన్నా దానిని పూర్తిగా చదవడానికి మాత్రం పావు శతాబ్దం సమయం పట్టింది. పుస్తకాలు చదవడం అంటే పేజీలు తిప్పడం కాదు. ఆ సమాచారాన్ని స్వీకరించే సరైన సమయం రావాలని రజనీకాంత్ నమ్ముతారు. బహుశా ఆయనలోని ఆధ్యాత్మిక పరిణితి ఆ పుస్తకంలోని సత్యాలను అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవడానికి 25 ఏళ్ల కాలం అవసరమైందేమో. ఈ పుస్తకం చదివిన తర్వాతే రజనీకాంత్ లో ఎన్నో మార్పులొచ్చాయ‌న్నారు.

అందులోని బాబాజీ గురించిన విశేషాలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. ర‌జ‌నీకాంత్ `బాబా` సినిమాకు కూడా ఈ పుస్తకమే ప్రధాన ప్రేరణ అని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఒక పుస్తకం ఒక మనిషి ఆలోచనా దృక్పథాన్ని ఎలా మార్చగలదో చెప్పడానికి రజనీకాంత్ ప్రయాణమే మంచి ఉదాహరణ. వేల కోట్ల సామ్రాజ్యం, అంతులేని కీర్తి ఉన్నప్పటికీ, ఆయన వెతుకుతున్న శాంతి ఆ పుస్తకంలోని అక్షరాల్లోనే దొరికిందని ఆయన నమ్ముతారు. రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకుడు ఇలాంటి విషయాలను పంచుకోవడం వల్ల సమాజంలో ముఖ్యంగా యువతలో పుస్తక పఠనం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.

భౌతిక విజయాలే జీవితం కాదని, అంతర్గత ప్రయాణం కూడా ముఖ్యమని ర‌జ‌నీకాంత్ ప్రవర్తన ద్వారా నిరూపిస్తున్నారు. రామకృష్ణ ఆశ్రమం వేసిన పునాది, `ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి` రజనీకాంత్‌ను ఓ విలక్షణమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. పుస్తకాలు చదవడం అనేది నిరంతర ప్రక్రియ. కొన్ని పుస్తకాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మరికొన్నిటిని మనం వెతుక్కుంటూ వెళ్తాం. రజనీకాంత్ విషయంలో ఆ పుస్తకం 25 ఏళ్ల పాటు ఆయన చెంతనే ఉన్నా? సరైన సమయంలోనే కళ్లు తెరిపించింది.

Tags:    

Similar News