ఒక్కసారి మాత్రమే బ్రతుకుతాం, భయపడొద్దు .. పూరీ చెప్పిన చార్వాక ఫిలాసఫీ

భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో చార్వాక తత్వానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని లోకాయత సిద్ధాంతంగా కూడా పిలుస్తూంటారు.

Update: 2026-05-20 12:00 GMT

టాలీవుడ్‌లో డైర‌క్ట‌ర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్న పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాలకే పరిమితం కాకుండా తన ఆలోచనలతో కూడా ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంటారు. ముఖ్యంగా ఆయన రూపొందిస్తున్న పూరీ మ్యూజింగ్స్ అనే ఆడియో సిరీస్ యూత్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. జీవిత తత్వం, మనుషుల ప్రవర్తన, ప్రేమ, డబ్బు, భయం, ఒత్తిడి, స్వేచ్ఛ వంటి అనేక అంశాలపై పూరీ తనదైన స్టైల్లో మాట్లాడుతుంటారు. అలాంటి మ్యూజింగ్స్‌లో చార్వాక తత్వం గురించి ఆయన చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తత్వశాస్త్రంపై పెద్దగా అవగాహన లేని యూత్ కూడా ఈ ఎపిసోడ్‌ను ఆసక్తిగా వింటుండటం విశేషంగా మారింది.

భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో చార్వాక తత్వానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని లోకాయత సిద్ధాంతంగా కూడా పిలుస్తూంటారు. కనిపించేది, అనుభవించేది మాత్రమే నిజమని… మనిషిగా పుట్టిన త‌ర్వాత ఉన్న ఈ ఒక్క జీవితాన్నే ఆనందంగా గడపాలని ఈ తత్వం చెబుతుంది. పాపం, పుణ్యం, మరణానంతర జీవితం వంటి అంశాలను నమ్మకుండా ప్రస్తుత క్షణానికే ప్రాధాన్యం ఇవ్వడం దీని ప్రధాన భావన. అయితే ఈ తత్వాన్ని చాలామంది కేవలం భోగవాదంగా మాత్రమే అర్థం చేసుకుంటారని, కానీ అసలు ఉద్దేశం భయంలేని జీవితం అని పూరీ తన మ్యూజింగ్స్‌లో వివరించడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ ఇతరులు ఏమనుకుంటారో అని భయపడుతూ బ్రతికేస్తే మన అసలు జీవితం మిస్ అయిపోతుందంటూ ఆయన చెప్పిన పాయింట్లు యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇప్పటి జనరేషన్‌లో యాంగ్జైటీ, డిప్రెష‌న్, సోష‌ల్ ప్రెజ‌ర్ లాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో పూరీ చెప్పిన మాటలు చాలామందికి రిలీఫ్ ఇచ్చేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అవ‌స‌రం లేని గిల్ట్ వ‌ల్ల చాలా మంది తమ హ్యాపీనెస్‌ను తామే నాశ‌నం చేసుకుంటున్నార‌ని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

నీకు నచ్చిన పని చేస్తే తప్పు కాదు… నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకోవాల‌నే భావనతో పూరీ మాట్లాడటం యూత్‌కు మరింత కనెక్ట్ అయ్యింది. అయితే కొందరు మాత్రం చార్వాక తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా తీసుకుంటే అది బాధ్యతలేని జీవన విధానంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ పూరీ చెప్పిన విధానం మాత్రం ఆలోచింపజేసేదిగా ఉందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల్లో మాస్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే పూరీ జగన్నాథ్… పూరీ మ్యూజింగ్స్ ద్వారా జీవితంపై తన ఫిలాసఫీని కూడా అదే రేంజ్‌లో ప్రజలకు చేరవేస్తుండటం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది.

Tags:    

Similar News