"నన్ను రోడ్డుపై పడేయకండి".. వైరల్ అవుతున్న పోసాని కామెంట్స్
చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి తన కొత్త సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.;
చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి తన కొత్త సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా రాజకీయాల్లో ప్రవేశించి ప్రత్యర్థులకు టార్గెట్ గా మారిన పోసాని మారిన రాజకీయ పరిణామాలతో తనను సినిమా చేసుకోనివ్వండని, రోడ్డుపై పడేయొద్దని సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లి వచ్చిన పోసాని కృష్ణమురళి పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపాయి.
‘‘చాలా కాలం తర్వాత సినిమా చేసుకుంటున్నాను అబ్బా.. నన్ను రోడ్డుపై పడేయొద్దు అబ్బా’’ అంటూ వ్యాఖ్యానించిన పోసాని కొంచెం క్షమించాలని ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు. తన సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదని క్లారిటీ ఇస్తూనే రోడ్డుపై పడేయొద్దని రాజకీయ ప్రత్యర్థులను విన్నవించుకున్నారు. నవ్వుతూ మాట్లాడుతూనే ప్రత్యర్థులను ప్రసన్నం చేసుకునేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.
ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయలి, జైలుకు వెళ్లాలి అని చెప్పిన పోసాని తాను జైలుకు వెళ్లిన ఉదంతాన్ని మరోసారి గుర్తు చేశారు. వైసీపీ తరఫున క్రియాశీలంగా పనిచేసిన పోసాని కృష్ణమురళి 2025 ఫిబ్రవరిలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు పోలీసుస్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు అవగా, గుంటూరు జైలులో 25 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండాల్సివచ్చింది. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసాని, మళ్లీ మెగాఫోన్ పట్టుకుంటున్నట్లు గత జూన్ లో ప్రకటించారు.
ఇక ‘ఓసేయ్ రాములమ్మ’ తరహాలో పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నట్లు గతంలోనే చెప్పిన ఆయన తన కొత్త సినిమాలో తన రాజకీయ ప్రయాణంపైన రాజకీయ జీవితంపైన ఏమైనా చెప్పదలచుకున్నారా? అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పోసాని కొత్త సినిమా కథాంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాల్లో తనదైన మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిలం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనుగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఆయన కొన్నాళ్లుగా రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు. అదే సమయంలో కొత్త సినిమా నిర్మాణంపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అయితే ఈ సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూ, తన రెండో ఇన్నింగ్స్ లో ఆటంకాలు సృష్టించొద్దని ఆయన వేడుకోవడం ఆసక్తికరంగా మారింది.