నాగబంధం గ్రాండ్ సెట్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విశేషమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం నాగబంధం ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటోంది. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో దర్శకుడిగా మారిన అభిషేక్ నామా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, విరాట్ కర్ణ కొత్త లుక్‌తో, వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విశేషమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో ఓ కీలకమైన 10 నిమిషాల ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.10 కోట్ల ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ భాగాన్ని మరో స్థాయిలో తీర్చిదిద్దేందుకు బాలీవుడ్ కోరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యను తీసుకున్నారు. ఈ పాటలో విరాట్ కర్ణతో పాటు హీరోయిన్లు నభ నటేష్, దక్ష నగర్కార్, అలాగే దాదాపు 5000 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు.
ఈ పాట చిత్రీకరణ కోసం కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆధారంగా ఒక అద్భుతమైన సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌ను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ రూపొందించగా, దానికి సుమారు రూ.6 కోట్లు ఖర్చైనట్లు సమాచారం. ఆలయం రూపం అచ్చంగా పోలిన ఈ సెట్ చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇంత అద్భుతంగా ఉండబోదని అనుకున్నాం.. నిజంగా ఆలయాన్ని చూసిన భావన కలిగింది అని కొందరు మీడియా ప్రతినిధులు తెలిపారు.
ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి. సాంస్కృతికంగా, విజువల్‌గా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని టీం చెబుతోంది. గణేశ్ ఆచార్య ఆలోచనతో వచ్చే స్టెప్స్, విరాట్ కర్ణ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కలిపి ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే పాటకు సంబంధించిన ఫుటేజీ చూసిన కొందరు టెక్నీషియన్స్.. ఈ సీన్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్‌గా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ పాటతో పాటు కీలకమైన భాగాలు పూర్తయ్యాక, పోస్ట్ ప్రొడక్షన్ జరగనుంది. నాగబంధం సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. విరాట్ కర్ణ ఫిట్నెస్ పరంగా కూడా పూర్తిగా మారిపోయి ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.