ఇండియన్ సినిమాలో మైథలాజికల్ ట్రెండ్!
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాల ఘర్జనే వినిపిస్తోంది.
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాల ఘర్జనే వినిపిస్తోంది. ఒకప్పుడు సాంప్రదాయ కథలకే పరిమితమైన జానర్ ఇప్పుడు ఆధునిక సాంకేతికత, సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ తో పాన్-ఇండియా స్థాయిలో మహా సంచలనానికి తెరలేపుతోంది. ఇతిహాసాలు, దైవిక చరిత్రలు , పురాణ గాథలను నేటి తరానికి తగ్గట్టు నూతన హంగులతో అందించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక-నిర్మాతలు క్యాలెండర్‌ను లాక్ చేసుకున్నారు. వెండితెరపై సరికొత్త భక్తి , యాక్షన్ పవర్‌ను నింపుతున్న మైథలాజికల్ ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ పౌరాణిక పరంపరలో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న `మహాకాళ్` గురించే. ఉజ్జయిని మహాశివుడి చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ హల్క్ రాణా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దైవిక శక్తి, చరిత్ర మేళవింపుతో రానున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంబినేషన్ `గాడ్ ఆఫ్ వార్` రూపంలో రూపుది ద్దుకుంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ప్లాన్ చేసారు. యుద్ధ తత్వాన్ని, కార్తికేయ స్వామి శక్తిని ఆధునిక కమర్షియల్ హంగులతో తెరపైకి తేవాలనే ఈ ప్రయత్నం తారక్ అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలను పెంచేస్తోంది.
ఇక బాలీవుడ్‌లో ఇండియన్ సినిమా గర్వించదగ్గ ప్రాజెక్ట్‌గా నిలుస్తున్న నితీష్ తివారి `రామాయణ్` కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ మొదటి భాగం నవంబర్ 6న రిలీజ్ అవుతుంది.రామాయణ గాథను హాలీవుడ్ రేంజ్‌లో విజువలైజ్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఇదే కోవలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) ద్వారా మరో సంచలనానికి తెరలేపుతున్నారు. కన్నడ `కాంతార` స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో `జై హనుమాన్` సినిమా వస్తుండగా, సరికొత్త శక్తివంతమైన అమ్మవారి కాన్సెప్ట్‌తో `మహాకాళి` చిత్రం జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేస్తున్న ఈ మైథలాజికల్ వరల్డ్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తానికి కమర్షియల్ రొటీన్ కథలకే పరిమితం కాకుండా మన మూలాలను, పౌరాణిక వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శక-నటులు చేస్తున్న సాహసోపేత ప్రయత్నం ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్‌లో మరో మెట్టు పైకి ఎక్కించనుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మైథలాజికల్ చిత్రాల హోరు ఏ రేంజ్‌లో ఉంటుందో? చూడాలి.