ఎగ్జామ్ హాల్ లోకి స్లిప్స్ తెస్తే ఈ బాక్స్ లో వెయ్యాలి.. ఏమిటిది..!
సాధారణంగా ఒకప్పుడు పరీక్షల్లో కాపీ కొట్టడానికి చిట్టీలు పెట్టేవారు. ఈ విషయంలో ఎవరి టాలెంట్ వారికి ఉండేదని అంటారు.;
సాధారణంగా ఒకప్పుడు పరీక్షల్లో కాపీ కొట్టడానికి చిట్టీలు పెట్టేవారు. ఈ విషయంలో ఎవరి టాలెంట్ వారికి ఉండేదని అంటారు. దీనికి సంబంధించిన పలు సినిమాల్లోని సన్నివేశాలు హాస్యం తెప్పించేవిగా కొన్ని ఉంటే.. ఎడ్యుకేట్ చేసేలా మరికొన్ని ఉండేవని అంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. చిట్టీల స్థానంలో వాచ్ లో యాప్ లు, స్కానర్లు, మెడలోని చైన్ కి ఉన్న పెండెంట్ లోనూ స్కానర్లు వచ్చాయని చెబుతున్నారు! ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... చిట్టీలకు సంబంధించిన విషయంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులోభాగంగా.. వచ్చే నెలలో జరగనున్న టెన్త్, ఇంటర్ పరీక్షలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో.. విద్యార్థులు కాపీ కొట్టకుండా చూసేలా యాప్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను అధికారులు సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే... హానెస్టీ బాక్స్ అనే ఓ వినూత్న ప్రయత్నం చేశారు అధికారులు.
విద్యార్థుల నిజాయతీ, నైతిక విలువలను పరీక్షించేందుకు అని చెబుతున్న ఈ బాక్స్ ను ప్రతి పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద అమర్చనున్నారు. ఈ సమయంలో.. విద్యార్థులు ఎవరైనా చిట్టీలు పెట్టడం, కాపీయింగ్ కు దోహదపడే పరికరాలు తీసుకురావడం వంటివి చేస్తే.. పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత వాటిని ఈ పెట్టెలో వేసి, అనంతరం పరీక్ష హాలులోకి వెళ్లవచ్చు. దీనివల్ల శిక్షల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
అంతకంటే ముఖ్యంగా నిజాయతీతో పరీక్ష రాయాలనే అవగాహన పెంచడమే ఈ వినూత్న ఆలోచన లక్ష్యం అని అంటున్నారు. ఇదే సమయంలో... విద్యార్థుల్లో నిజాయతీని, నైతిక బాధ్యతను ఈ హానెస్టీ బాక్స్ గుర్తుచేస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి బుద్ధేశ్ కుమార్ వైద్య.. పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా జరగాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.
ఎవరైనా అనవసరమైన వస్తువులు తెస్తే, పరీక్ష మొదలయ్యే ముందు వాటిని ఈ హానెస్టీ బాక్సుల్లో వదిలేసి, సొంతగా పరీక్ష రాయాలని తెలిపారు. మరోవైపు పరీక్షలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు హాల్ టికెట్ లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అదేవిధంగా... ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ఉండేందుకు ట్రాకింగ్ అప్లికేషన్ ను వినియోగించనున్నారు.