మోక్షజ్ఞ ఎంట్రీ.. మళ్ళీ అదే పాట!
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అనేది టాలీవుడ్ లో ఒక అంతుచిక్కని పజిల్ లా మారింది.;
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అనేది టాలీవుడ్ లో ఒక అంతుచిక్కని పజిల్ లా మారింది. ఏళ్ల తరబడి "వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు" అనే వార్తలే తప్ప, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మూడు పదుల వయసులోకి వచ్చినా సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. మోక్షజ్ఞ ఫొటోలు బయట కనిపించినప్పుడు ఫ్యాన్స్ ఖుషి అవ్వడమే తప్ప ఎంట్రీ మిస్టరీ వీడడం లేదు. ఇక ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) వేదికగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఈ టాపిక్ ని హీట్ ఎక్కించాయి.
'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమాను మోక్షజ్ఞతో చేస్తానని బాలయ్య కన్ఫర్మ్ చేశారు. అయితే ఇది గుడ్ న్యూసా లేక మరో కొత్త కన్ఫ్యూజనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు 'ఆదిత్య 369' అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్. దానికి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మామూలుగా వారసుల ఎంట్రీ అంటే సేఫ్ గా ఒక లవ్ స్టోరీనో, లేదా ఫ్యామిలీ డ్రామానో ఎంచుకుంటారు.
కానీ బాలయ్య మాత్రం తన కొడుకు కోసం అత్యంత క్లిష్టమైన 'సైన్స్ ఫిక్షన్' జానర్ ని ఎంచుకోవడం నిజంగా పెద్ద సాహసమే. ఇంత బరువైన సబ్జెక్ట్ ని ఒక డెబ్యూ హీరో మోయగలడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొన్నటి వరకు 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని హడావిడి జరిగింది. అది గ్రాండ్ గా లాంచ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాత పాటే పాడుతూ బాలయ్య 'ఆదిత్య 999' ని తెరపైకి తెచ్చారు.
దీన్ని బట్టి చూస్తుంటే, బయట దర్శకుల కథలు మోక్షజ్ఞకు సెట్ అవ్వడం లేదని, లేదా వాళ్ళు డీల్ చేస్తున్న విధానం బాలయ్యకు నచ్చడం లేదని అర్థమవుతోంది. అందుకే తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లున్నారు. గతంలో ఆయనే దర్శకుడు అని అప్డేట్స్ వచ్చాయి.. మధ్యలో కొంతమంది దర్శలుల పేర్లు వైరల్ అయినా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడో సమస్య ఉంది. బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఎప్పటి నుంచో ఈ మాట చెబుతూనే ఉన్నారు.
కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ ఇవ్వలేదు. ఇది డెబ్యూ సినిమానా? లేక రెండో సినిమానా? అనేది కూడా సస్పెన్సే. ఒకవేళ ఇదే డెబ్యూ అయితే, విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్ పరంగా చాలా సమయం పడుతుంది. అప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. కేవలం నాస్టాల్జియా మీద ఆధారపడి సినిమా తీస్తే నేటి జనరేషన్ ఒప్పుకోరు. మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ ని, స్క్రీన్ ప్రెజెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే రిస్కీ సబ్జెక్ట్ మరొకటి ఉండదు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కొడుకు కెరీర్ ని ప్రయోగశాలగా మారుస్తున్నారా అనే సందేహం కలగకమానదు.
మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ వ్యవహారం చూస్తుంటే.. ఆదిత్య 369 లోని టైమ్ మెషీన్ లాగే అనిపిస్తోంది. ఎప్పుడు ఏ కాలానికి వెళ్తుందో, ఏ ప్రాజెక్ట్ దగ్గర ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యి, అఫీషియల్ గా పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.