ట్రెండీ టాక్: సినిమా వ్యాపారం దిగజారితే హీరోయిన్‌లే బలిపశువులా?

దక్షిణాదిలో నయనతార, సమంత, తమన్నా వంటి స్టార్లు కూడా ఇదే రకమైన వివక్షపై గొంతు విప్పారు.;

Update: 2026-05-11 04:53 GMT

సినీ పరిశ్రమలో పారితోషికాల వ్యత్యాసం అనేది దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య. సినిమా వ్యాపారం మందగించినప్పుడో లేదా బడ్జెట్ అదుపు తప్పినప్పుడో నిర్మాతలు మొదట `కాస్ట్ కటింగ్` పేరుతో హీరోయిన్ల పారితోషికాలకే కోత విధిస్తుంటారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినిమా బిజినెస్ సరిగా లేనప్పుడు హీరోయిన్ల పారితోషికం తగ్గించాలని అడిగే నిర్మాతలు హీరోల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని సూటిగా ప్రశ్నించారు. హీరోల పారితోషికాలను టచ్ చేయలేక.. హీరోయిన్లనే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని కృతి నిలదీశారు.

కేవలం కృతి సనన్ మాత్రమే కాదు... స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. మేల్ డామినేషన్‌ను అస్సలు అంగీకరించని దీపికా తన పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోలతో సమానంగా పారితోషికం డిమాండ్ చేస్తుంటుంది. ఒక సినిమా విజయానికి హీరో ఎంత కీలకమో.. హీరోయిన్ కూడా అంతే కీలకమని డీపీ నమ్ముతుంది. తక్కువ పారితోషికం ఇస్తామంటే దీపిక‌ ఏకంగా ప్రాజెక్టుల నుండే తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. పారితోషికం అనేది కేవలం డబ్బు మాత్రమే కాదని.. అది ఒక నటి ప్రతిభకు ఇచ్చే గౌరవమనేది దీపిక‌ వాదన. ఇటీవ‌ల ప్ర‌భాస్ స్పిరిట్ నుంచి త‌ప్పుకోవ‌డానికి పారితోషికంలో వ్య‌త్సాసం లేదా అధిక పారితోషికం డిమాండ్ కూడా ఒక కార‌ణ‌మ‌నే చ‌ర్చ సాగింది.

దక్షిణాదిలో నయనతార, సమంత, తమన్నా వంటి స్టార్లు కూడా ఇదే రకమైన వివక్షపై గొంతు విప్పారు. `లేడీ సూపర్ స్టార్`గా గుర్తింపు పొందిన నయనతార తన మార్కెట్ స్టామినాను బట్టి పారితోషికాన్ని ఖరారు చేసుకుంటారు. నేడు సౌతిండియాలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న మేటి క‌థానాయిక‌గా న‌య‌న్ పేరు మార్మోగుతోంది. సమంత -తమన్నా కూడా పారితోషికాల కటింగ్ గురించి మాట్లాడుతూ.. పరిశ్రమలో నటీమణులకు ఇచ్చే విలువను ప్రశ్నించారు. సినిమా లాభాల్లో ఉన్నప్పుడు క్రెడిట్ అంతా హీరోలకు ఇచ్చి.. బడ్జెట్ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం హీరోయిన్లను బలిపశువులను చేయడం ఒక అనారోగ్యకరమైన సంప్రదాయమని వారు అభిప్రాయపడ్డారు.

తాప్సీ పన్ను- కాజల్ అగర్వాల్ సైతం ఈ అన్యాయాన్ని పలుమార్లు ఎండగట్టారు. తాప్సీ మాట్లాడుతూ.. తాము హీరోలతో సమానంగా ఇవ్వమని కోరడం లేదని.. కనీసం తమ కష్టానికి తగ్గ సముచితమైన పారితోషికం ఇవ్వాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. హీరోయిన్లు కూడా రిస్క్ తీసుకుని యాక్షన్ సీక్వెన్సులలో నటిస్తున్నారని..ప్రమోషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. కేవలం గ్లామర్ కోసమే హీరోయిన్లు అనుకునే రోజులు పోయాయని.. ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తాము కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టగలమని ప‌లువురు క‌థానాయిక‌లు నిరూపిస్తున్నారు.

హీరోయిన్లు తమ హక్కుల గురించి.. సమానత్వం గురించి ప్రశ్నించడం ఎంతమాత్రం తప్పు కాదు. ఒక పరిశ్రమలో స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతిభకు పట్టం కట్టినప్పుడే ఆ పరిశ్రమ ఆరోగ్యంగా ఎదుగుతుంది. సినిమా వ్యాపారం తగ్గినప్పుడు భారాన్ని అందరూ సమానంగా పంచుకోవాలి కానీ కేవలం నటీమణులనే లక్ష్యంగా చేసుకోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంద‌నే విశ్లేష‌ణ సాగుతోంది. నటీమణులు తమ పారితోషికం విషయంలో రాజీ పడకుండా పోరాడటాన్ని మీరైతే ఏ విధంగా త‌ప్పు ప‌ట్ట‌గ‌ల‌రు?

Tags:    

Similar News