సూర్య కిరణ్ ఎప్పుడూ మనశ్శాంతిగా లేరు!
విడిపోయినా సరే ఎక్కువగా తన మాజీ భార్య గురించే మాట్లాడేవారని, మళ్లీ ఆమెతో కలవడానికి ఆసక్తి చూపించారని తెలిపింది.
ప్రముఖ దర్శక నటుడు, నటి కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో తీవ్రంగా ఇబ్బందులు పడిన ఆయన, నిన్న చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. దర్శకుడి మరణంపై తాజాగా నటి కరాటే కళ్యాణి ఓ ఇంటర్వూలో స్పందించింది. ఆయనకు ఎప్పుడూ మనశ్శాంతి లేదని, ఇప్పుడైనా పైలోకాన మనశ్శాంతిగా ఉంటారేమో అని కీలక వ్యాఖ్యలు చేసింది. విడిపోయినా సరే ఎక్కువగా తన మాజీ భార్య గురించే మాట్లాడేవారని, మళ్లీ ఆమెతో కలవడానికి ఆసక్తి చూపించారని తెలిపింది.
తెలుగు బిగ్ బాస్ సీజన్-4లో సూర్య కిరణ్ తో పాటు కరాటే కల్యాణి కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఇలా మాట్లాడి రావాల్సి రావడం చాలా బాధాకరం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని కళ్యాణి మాట్లాడింది. "ఆయన అన్ని విధాలుగా ఎప్పుడూ మనశ్శాంతిగా లేరు. ఇప్పుడైనా పైలోకాన మనశ్శాంతిగా ఉంటారేమో. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడంతో ఆయన బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. దాంతో పాటుగా అలవాట్లు బాగా ఎక్కువైపోయాయి. అలాంటి అలవాట్లు మనిషిని బాగా దిగజార్చేస్తాయి. నాకు ఎవరూ లేరు నాకెందుకు ఈ లైఫ్ అని ఆయన అన్నీ వదిలేసుకున్నారు" అని కరాటే కళ్యాణి చెప్పింది.
"డివర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ ఆవిడ గురించే మాట్లాడేవారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె గురించి చాలా మంచిగా చెప్పేవారు. ఆమె అంటే అంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. అంత ప్రేమ ఉంది కాబట్టే అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని అనుకోవచ్చు. అదంతా వారి పర్సనల్ మ్యాటర్. కానీ అదే ఆయనపై దెబ్బ పడేలా చేసింది. వాళ్లిద్దరూ విడిపోయారనే విషయాన్ని ఆయన బాగా డీప్ గా మనసుకి తీసుకున్నారు. ఇంక నాకు ఏమీ అవసరం లేదు అనుకున్నారు."
"చైల్డ్ ఆర్టిస్టుగా సురేష్ అనే పేరుతో 200 సినిమాల్లో చేశారు. ఆయన మంచి దర్శకుడే కాదు, మంచి సింగర్, డ్యాన్సర్. కానీ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండటం వల్ల ఉబకాయం వచ్చేసింది. ఫస్ట్ నుంచి ఆయన కాస్త బొద్దుగానే ఉండేవారు. అయినా సరే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేవారు. మాకు అనారోగ్య సూచనలు ఏమీ కనిపించలేదు. కానీ అన్నీ వదిలేసి ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ గా సిగరెట్, మందు తాగుతూ.. అదే పనిలో ఉంటే ఎన్ని రోజులని బాడీ తట్టుకుంటుంది. ఒకటి రెండు నెలల్లో బాడీలో రియాక్షన్ కనిపిస్తుంది."
"నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడలేదు కానీ, ఆయనకు జాండిస్ వచ్చాయని విన్నాను. లివర్ ప్రాబ్లమ్ వస్తేనే అలా అవుతుంది. ఇంకెందుకు ఈ లైఫ్ అనుకోని ఉన్న అలవాట్లను కంట్రోల్ చేసుకోకుండా అన్నీ కొనసాగించి ఉంటారని నేను అనుకుంటున్నాను. జాండిస్ తర్వాత మళ్లీ తాగడమో, సిగరెట్ స్మోకింగ్ చేసారేమో అనేది తెలుసుకోవాలి. ఒకవేళ చేసుంటే హార్ట్ ఫెయిల్ అయ్యుండొచ్చు. ఆయన వయసు 50 ఏళ్ల లోపే. మాకంటే నాలుగైదేళ్లు మాత్రమే పెద్ద అంతే. అలాంటిది ఆయన చనిపోయారనే విషయం నాకు షాకింగ్ గా అనిపిస్తోంది."
"ఇద్దరు చెల్లెళ్ళు అంటే అతనికి ఎంతో ఇష్టం. సుజిత అంటే ప్రాణం. తన వైఫ్ పేరు నా పేరు ఒకటే అయినప్పటికీ.. తన చెల్లెళ్ళలా ఉంటావని నన్ను లక్ష్మీ అని పిలిచేవాడు. ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం వుంది. మా ఇంటికి కూడా వచ్చారు. మా నాన్నగారితో పాటలు పాడించుకొని, మృదంగం వాయించమని కోరేవారు. తమ్ముడి దగ్గర స్టూడియోలో కూర్చొని పాట పాడారు. రాగి సంగటి అంటే ఇష్టమని ఇంట్లో చేయించుకొని తిన్నారు. హైదరాబాద్ వస్తే కచ్ఛితంగా నాకు ఫోన్ చేసేవారు. కానీ తక్కువ సార్లే కలిశాం."
"కలిసింది తక్కువైనా చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళం. 'సినిమా తీస్తున్నాను.. మీకు మంచి పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ఉంది' అని చెప్పారు. అంతేకాదు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతాను.. ఆఫీస్ కోసం ఇల్లు చూడమని నాతో కొన్ని నెలల క్రితమే అన్నారు. సినిమా స్టార్ట్ చేస్తానని నాతో ఎంతో స్ట్రాంగ్ గా చెప్పారు. ఇంతలోనే ఇలా జరిగింది. ఇదంతా ఆయన స్వయంకృపరాదం. డిప్రెషన్ మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. దాన్నుంచి బయటకు వచ్చినవారే విన్నర్స్ అవుతారు. ఆయన అలానే బయటకి వచ్చి ఉంటే, మంచి హిట్టు సినిమా తీసేవారు. ఇప్పుడు పొజిషన్ వేరేలా ఉండేది"
"తక్కువ కాలంలో ఓ వెలుగు వెలిగి, తానొక ఆల్ రౌండర్ అని, తనంటే ఏంటో చూపించి అలా వెళ్ళిపోయాడు. చాలా మంచి మనిషి. ఎలాంటి కుల్లు కుతంత్రాలు ఉండని వ్యక్తి. బిగ్ బాస్ లో నాతోనే ఎక్కువగా ఉండేవారు. ఆయన ఎక్కువ ప్రైవేట్ లైఫ్ ఇష్టపడతారు. అందరిలా ఉండరు. ఆయనకున్న అలవాట్ల దృష్ట్యా కావొచ్చు అందరితో కలసి ఉండరు. నాలుగు నెలల క్రితం ఇళ్లు చూడమని చెప్పిన తర్వాత, బిజీగా ఉన్నారేమో అని నేను మళ్ళీ కాల్ చేయలేదు."
"హౌస్ నుంచి త్వరగా బయటకి వెళ్లిపోతారని మాతో పాటుగా ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన బాగా కోపం చూపించేవారు. ఉన్న ఒక వారంలోనే మాతో బాగా క్లోజ్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత ఎక్కువసార్లు కలిశాం. చాలా మంచి వ్యక్తి. భగవంతుడు చాలా త్వరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడికన్నా ఆయన అక్కడ ఆనందంగా ఉంటారేమో. ఆయన ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే.. అలవాట్లకు ఎక్కువ అడిక్ట్ అయిపోయి కావాలని చేసుకున్నారు" అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.