నందమూరి ఫోర్త్ జెనరేషన్.. మరో 'రామ్' ఎంట్రీ పక్కానా?
ఇప్పటికే నందమూరి ఫోర్త్ జనరేషన్ నుంచి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో వారసత్వం అనే పదానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ఫ్యామిలీల్లో నందమూరి కాంపౌండ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పటికే మూడు జెనరేషన్లుగా ఆ ఫ్యామిలీ నుంచి హీరోలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుండగా.. ఇప్పుడు నాలుగో జెనరేషన్ కూడా ఎంట్రీకి సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
నిజానికి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన కొడుకులు బాలకృష్ణ, హరికృష్ణ సినిమాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించగా.. కళ్యాణ్ రామ్ విభిన్న కథలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఇప్పటికే నందమూరి ఫోర్త్ జనరేషన్ నుంచి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆ ప్రాజెక్టును తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ కూడా జరుగుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ పేరు నెట్టింట ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు.
జై లవకుశ, బింబిసార, దేవర వంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులను తన బ్యానర్ పై నిర్మించారు. మరోవైపు నటుడిగా కూడా కొత్త తరహా కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ మాత్రం అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు.
ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ ఎంట్రీపై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అయితే ఆ ప్రచారానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో. అందులో శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతడి ఫిట్ నెస్, పవర్ ఫుల్ పంచ్ లు, యాక్షన్ మూవ్స్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరో నందమూరి హీరో రెడీ అవుతున్నారని, మరో మాస్ హీరో వస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే శౌర్య రామ్ ఇంకా చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సినీ ఎంట్రీ ఇప్పుడే ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. సరైన సమయం వచ్చిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నందమూరి కుటుంబం నుంచి వచ్చే ప్రతి కొత్త హీరోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం.
ముఖ్యంగా యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు శౌర్య రామ్ కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తాడా? లేక తనకంటూ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నందమూరి నాలుగో తరం నుంచి మరో హీరో ఎంట్రీకి వేదిక సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే.