ఫ్యామిలీ సినిమా దెబ్బకు ఫ్యామిలీ సినిమా మాయం
సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య నుంచి వచ్చిన కొత్త సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు గత వారం అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.
సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య నుంచి వచ్చిన కొత్త సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు గత వారం అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వీకెండ్లో ఆ సినిమా ఊపు చూస్తే చాలా పెద్ద రేంజికి వెళ్లేలా కనిపించింది. తమిళంలో రిలీజ్ ముంగిట అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోయినా.. రిలీజ్ తర్వాత పుంజుకుంది. తెలుగులో అయితే ఈ చిత్రం ఇక్కడి మిడ్ రేంజ్ స్టార్ల సినిమాల స్థాయిలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత తమిళంలో జోరు తగ్గినా.. తెలుగులో మాత్రం సూర్య సినిమా బలంగానే నిలబడింది. ఈ మధ్య ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలన్నీ బాగా ఆడుతుండగా.. ఆ కోవలోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి ప్రభావం చూపింది. తొలి వారంలోపే రూ.150 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందని.. ఇంకా పెద్ద రేంజికి వెళ్తుందని భావించారు ట్రేడ్ పండిట్లు.
కానీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రన్ సడెన్‌గా ఎండ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తమిళంలో వీకెండ్ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. షేర్లు పడిపోయాయి. తెలుగులో గురువారం వరకు సినిమా పర్వాలేదనిపించినా.. శుక్రవారంతో ఆ సినిమా పనైపోయినట్లు కనిపిస్తోంది. రవితేజ సినిమా ‘ఇరుముడి’ ఉప్పెనలా వచ్చి సూర్య చిత్రంపై పడింది. మొత్తం ప్రేక్షకులు ఒక్కసారిగా ఈ సినిమా వైపు టర్న్ అయిపోయారు. ‘ఇరుముడి’ వేరే జానర్ మూవీ అయితే ఓకే కానీ.. అది కూడా ఫ్యామిలీ మూవీనే కావడంతో ఆ వర్గం ప్రేక్షకులకు అదే ఛాయిస్‌గా మారింది. ఇక అయ్యప్ప మాల నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో అయ్యప్ప భక్తులు ఈ సినిమా కోసం ఊగిపోతున్నారు. ఇందులో మాస్ అంశాలు, థ్రిల్లర్ టచ్ ఉండడంతో ఆ వర్గం ప్రేక్షకులకూ ఇది నచ్చుతోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తిగా క్లాస్‌గా సాగే ఫ్యామిలీ మూవీ కావడంతో దాని పరిధి తగ్గిపోయింది. ఫ్యామిలీ సినిమాను ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమానే రీప్లేస్ చేయడంతో సూర్య చిత్రానికి చెక్ పడిపోయింది. ఇక ఆ సినిమాకు పెద్దగా షేర్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.