ఆస్కార్ రేసులో మనోళ్లు: రాజమౌళి కంటే ముందే 'అకాడమీ' స‌భ్య‌త్వం పొందిన‌ టాప్-10 భారతీయులు!

గత దశాబ్ద కాలంలో అకాడమీ తన సభ్యత్వ పరిధిని అంతర్జాతీయంగా విస్తరించడం ప్రారంభించిన తర్వాత రాజమౌళి కంటే ముందే పలువురు ప్రముఖ భారతీయ దర్శకులకు ఓటింగ్ హక్కు కల్పించింది.

Update: 2026-06-27 01:30 GMT

113 సం.ల భార‌తీయ సినిమా హిస్ట‌రీలో ఆస్కార్స్ పిలుపు అందుకున్న టాప్-10 సినీప్ర‌ముఖుల గురించి వివ‌రాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. సత్యజిత్ రే నుండి రాజమౌళి వరకు ఆస్కార్ `అకాడమీ`లో ఓటు హక్కు సాధించిన భారతీయ దిగ్గజాల వివ‌రాల్లోకి వెళితే....

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ అవార్డులను నిర్వహించే `అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చ‌ర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్` నుండి ఆహ్వానం అందుకోవడం అనేది ఏ సినీ ప్రముఖుడికైనా అంతర్జాతీయంగా లభించే అత్యున్నత గౌరవం. ఇటీవలి కాలంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ వంటి వారికి అకాడమీ ఓటు హక్కు కల్పిస్తూ ఈ ఏడాది ఎంపిక చేయడం భారతదేశంలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అయితే వీరి కంటే చాలా కాలం ముందే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన పలువురు దిగ్గజ దర్శకులకు అకాడమీ నుండి ఈ అరుదైన గౌరవం, ఓటింగ్ హక్కు లభించాయి.

స‌త్య జిత్ రే- మృణాల్ సేన్:

భారతీయ సినిమా రంగానికి అంతర్జాతీయ వేదిక‌పై మొట్టమొదటిసారిగా గొప్ప గుర్తింపు తెచ్చిన మాస్టర్ డైరెక్టర్ సత్యజిత్ రే. అకాడమీతో అత్యంత బలమైన అనుబంధం ఉన్న భారతీయ దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. రే అసాధారణ ప్రతిభను గుర్తించిన అకాడమీ సంస్థ 1992లో ఆయనకు అత్యున్నత `లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్` (గౌరవ ఆస్కార్) అవార్డును ప్రకటించింది. అప్పట్లో ఆయన తీవ్ర అనారోగ్యంతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అకాడమీ ప్రతినిధులు స్వయంగా అక్కడికే వచ్చి ఆయనకు ఆస్కార్ అవార్డును అందజేసి గౌరవించారు.

సత్యజిత్ రే సమకాలీనుడైన సమాంతర సినిమా దిగ్గజ దర్శకుడు మృణాళ్ సేన్ కూడా చాలా ఏళ్ల క్రితమే అకాడమీ నుండి ఆహ్వానం అందుకున్నారు. భువన్ షోమ్, ఒక ఊరి కథ వంటి సామాజిక స్పృహ గల అద్భుత చిత్రాలను తెరకెక్కించిన ఈయనను అకాడమీ తన ఓటింగ్ ప్యానెల్‌లోకి ఆహ్వానించింది. అలాగే చాలామందికి తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...1960ల‌ కాలంలోనే లండన్, ఇటలీలలో పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న భారతీయ దర్శకుడు, ఎడిటర్ అమిత్ బోస్ అకాడమీలో సభ్యత్వం పొందిన తొలితరం భారతీయులలో ఒకరిగా నిలిచారు.

ద‌ర్శ‌కులుగా అమీర్ ఖాన్, అశుతోష్ గోవారిక‌ర్ :

గత దశాబ్ద కాలంలో అకాడమీ తన సభ్యత్వ పరిధిని అంతర్జాతీయంగా విస్తరించడం ప్రారంభించిన తర్వాత రాజమౌళి కంటే ముందే పలువురు ప్రముఖ భారతీయ దర్శకులకు ఓటింగ్ హక్కు కల్పించింది. దర్శకుడిగా తన మొదటి సినిమా `తారే జమీన్ పర్` (2007) ఘనవిజయం సాధించిన తర్వాత... నటుడిగా, దర్శకుడిగా ఆమిర్ ఖాన్‌కు అకాడమీ మెంబర్‌షిప్ లభించింది. అలాగే `లగాన్` చిత్రం 2002లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఆస్కార్ టాప్-5 నామినేషన్స్‌కు చేరిన తర్వాత.. ఆ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్‌ను అకాడమీ డైరెక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యుడిగా చేర్చుకుంది.

న‌టుల‌లో అమితాబ్-షారూఖ్:

వీరితో పాటు దక్షిణ భారత సినిమా గర్వించదగ్గ లెజెండరీ దర్శకుడు మణిరత్నంకు2018లోనే అకాడమీ నుండి అధికారిక ఆహ్వానం అందింది. అదే ఏడాది భారతీయ నయా-నోయిర్ చిత్రాల ట్రెండ్‌ను మార్చిన అనురాగ్ కశ్యప్‌కు కూడా అకాడమీ ఓటింగ్ ప్యానెల్‌లో సభ్యత్వం లభించింది. ఆ తర్వాత 2019లో `గల్లీ బాయ్` చిత్ర దర్శకురాలైన జోయా అక్త‌ర్‌ను అకాడమీ తమ ఓటింగ్ ప్యానెల్‌కు ఆహ్వానించింది. కేవలం దర్శకులే కాకుండా ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి వంటి సాంకేతిక నిపుణులు, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, న‌సీరుద్ధీన్ షా, మాధురి ధీక్షిత్ నీనే వంటి తార‌లు ఎందరో రాజమౌళి కంటే ముందే వేర్వేరు విభాగాల ద్వారా ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు.

Tags:    

Similar News