ఇళయరాజా మారడా?

దక్షిణాది సినీ ప్రియులకు ఇళయరాజా కేవలం సంగీత దర్శకుడు కాదు.. ఆయన్ని ఒక దేవుడిలా కొలుస్తారు.

Update: 2024-05-23 09:30 GMT

దక్షిణాది సినీ ప్రియులకు ఇళయరాజా కేవలం సంగీత దర్శకుడు కాదు.. ఆయన్ని ఒక దేవుడిలా కొలుస్తారు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆయన అందించిన క్లాసిక్స్ సాంగ్స్ వేలల్లోనే ఉంటాయి. నిన్నటితరం సంగీత ప్రియులు ఆ పాటలు విని పొందే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేరు. ఇళయరాజాకు ముందు, తర్వాత గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నప్పటికీ.. మ్యూజిక్ లవర్స్ మనసుల్లో మాస్ట్రో స్థానమే వేరు. సినిమా వాళ్లు కూడా ఇళయరాజా మీద అభిమానంతో తమ చిత్రాల్లో ఆయన పాటల ప్రస్తావన తెస్తుంటారు. ఇళయరాజాకు ఎలివేషన్ ఇస్తుంటారు. తమ చిత్రాల్లో ఇళయరాజా పాటలేవైనా బిట్లు బిట్లుగా వాడారు అంటే అది ఆయన మీద అభిమానం, గౌరవంతోనే తప్ప.. ఆ పాటల ద్వారా ఏదో ప్రయోజనం పొందుదామని కాదన్నది వాస్తవం.

కానీ ఇళయరాజా ఈ విషయం అర్థం చేసుకోకుండా ఏదైనా సినిమాలో తన పాట వినిపిస్తే చాలు.. లీగల్ నోటీసుల వరకు వెళ్లిపోతున్నారు. ఇటీవలే రజినీకాంత్ సినిమా ‘కూలీ’కి సంబంధించిన టీజర్లో ఇళయరాజా పాట వినిపించింది. ఐతే అందులో హీరో రజినీ తనకు మంచి మిత్రుడే అయినా సరే.. ఇళయరాజా లీగల్ నోటీసులు ఇచ్చేశారు. తన అనుమతి లేకుండా తన పాట వాడేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలో ‘గుణ’ చిత్రంలోని ఓ పాట వాడుకున్నారంటూ నోటీసులు ఇచ్చేశారు. ఇలా ఏ సినిమాలో తన పాట వినిపించినా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే.. రేప్పొద్దున ఇళయరాజా పాటను గుర్తు చేసుకోవడానికి భయపడే పరిస్థితి రావచ్చు. తన పాటలకు సంబంధించి హక్కులు, రాయల్టీ విషయంలో ఇళయరాజా గొడవ పడే తీరు ఎప్పట్నుంచో వివాదాస్పదం అవుతోంది. ఒక పాట మీద సంగీత దర్శకుడితో పాటు గాయకులు, గేయ రచయితలు, నిర్మాతలకూ హక్కులు ఉంటాయి. కానీ ఇళయరాజా మాత్రం పాట మీద సర్వ హక్కులూ తనవే అన్నట్లు గొడవలకు దిగడం.. రాయల్టీ కోరడం మీద ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. తనకు ఆప్త మిత్రుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నాడని నోటీసులు పంపడం అప్పట్లో ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. బాలు లాంటి వాడితో మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయానికి నోటీసులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాలు కూడా అప్పట్లో ఈ విషయమై ఎంతో బాధ పడ్డాడు కూడా. ఇప్పుడేమో ఇలా ఏ సినిమాలో తన పాట వినిపించినా నోటీసులు ఇచ్చేస్తున్నారు. తద్వారా తన మీద సంగీత ప్రియుల్లో ఉన్న అభిమానాన్ని దెబ్బ తీసుకుంటున్నారని, తనపై గౌరవం తగ్గేలా చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఆయన తీరు మార్చుకునేలా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సర్ది చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.

Tags:    

Similar News