Obsession: ఈ సెన్సేషనల్ సినిమా అసలు చెప్పాలనుకున్నది ఇదేనా?
హాలీవుడ్ చిత్రం అబ్సెషన్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో విజయాన్ని సాధించింది.
హాలీవుడ్ చిత్రం అబ్సెషన్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా విజయానికి కారణం కేవలం హారర్ లేదా థ్రిల్లర్ అంశాలు మాత్రమే కాదు. ఒక్కో ప్రేక్షకుడు ఈ కథను ఒక్కో విధంగా అర్థం చేసుకోవడమే దీనికి ప్రధాన బలం.
సింపుల్ కథ.. కానీ ఎన్నో అర్థాలు
కథ చాలా సాధారణంగా కనిపిస్తుంది. బేర్ అనే యువకుడు నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను ఆమెకు ఎప్పుడూ నేరుగా చెప్పలేడు. మరోవైపు నిక్కీ మాత్రం బేర్‌ను అన్నలాంటి వ్యక్తిగా భావిస్తుంది. అతనిపై పూర్తి నమ్మకం ఉంచుతుంది.
తన ప్రేమను చెప్పే ధైర్యం లేని బేర్, ఒక మాయా దిండును ఉపయోగించి నిక్కీ తనను ప్రపంచంలో ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటాడు. ఆ కోరిక నిజమవుతుంది. ఆ తర్వాత నిక్కీ ప్రేమ సాధారణ స్థాయిని దాటి అబ్సెషన్‌గా మారిపోతుంది. అక్కడి నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది.
First Message: ప్రేమ కావాలి.. కానీ తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం ఉండదు..!
ఈ సినిమాలో కనిపించే మొదటి సందేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమంది ఇతరుల ప్రేమ, శ్రద్ధ, అభిమానాన్ని కోరుకుంటారు. కానీ అదే ప్రేమను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. బేర్ కూడా అలాంటి వ్యక్తిగానే కనిపిస్తాడు. అతను నిక్కీ ప్రేమను కోరుకున్నాడు. కానీ ఆమె తనపై పూర్తిగా ఆధారపడిపోయిన తర్వాత ఆ ప్రేమ తీవ్రతను తట్టుకోలేకపోయాడు.
నేటి సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ప్రశాంతంగా, దూరంగా ఉంటారు. అయినా ఎదుటివారిని తమవైపు ఆకర్షిస్తారు. మొదట్లో వాళ్ళు తమని ఎక్కువగా ప్రేమించేలాగా చేసుకుంటారు. కానీ ఒకసారి ఒక అమ్మాయి, అబ్బాయితో విపరీతంగా ప్రేమలో పడిపోయిన తర్వాత, తమకోసం వారు ఎంతగా ఆలోచిస్తున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకుని కూడా పట్టించుకోనట్లు ప్రవర్తిస్తారు.
ఈ విషయాన్ని సినిమా చాలా బలంగా చూపిస్తుంది.
బేర్ నిక్కీ ప్రేమను కోరుకున్నాడు. కానీ ఆ ప్రేమ నిజంగా తన జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించలేకపోయాడు. దీనివల్ల "ఒకరిని మనపై భావోద్వేగంగా ఆధారపడేలా చేసి, ఆ తర్వాత వారి భావాలను పట్టించుకోకపోవడం కూడా ఒక రకమైన ప్రమాదమే" అనే సందేశాన్ని సినిమా ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Second Message: హద్దులు దాటిన సంబంధాలపై మరో కోణం
ఈ సినిమాలో రెండో కోణం కొన్ని చీకటి నిజాలను చూపించేలా ఉంటుంది. మొదట్లో నిక్కీ బేర్‌ను అన్నలాగా చూస్తుంది. అతనిపై పూర్తి నమ్మకం ఉంచుతుంది. బేర్‌కు కూడా ఈ విషయం బాగా తెలుసు.
అయితే ఆమె భావాలను అంగీకరించే బదులు, వాటిని మార్చడానికి అతను One Wish ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. దీంతో నిక్కీ ప్రేమలో పడుతుంది. తర్వాత అతనితో ఒకే మంచం పంచుకునే స్థాయికి చేరుతుంది. ఈ కోణంలో చూస్తే సినిమా కేవలం ప్రేమ కథ కాదు. ఒకరి భావాలను బలవంతంగా మార్చడం ఎంత ప్రమాదకరమో చెప్పే కథగా మారుతుంది.
నేటి సమాజంలో కూడా బంధాల హద్దులను దాటే సంఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. అక్క తమ్ముడు, అన్నా చెల్లెలు, అత్త అల్లుడు అనే బంధాలను కూడా ఇప్పుడు ఎంతోమంది ఎంత నీచంగా చూస్తున్నారో మనం తరచు వార్తల్లో వింటూనే ఉంటా.
అన్నాచెల్లెళ్లలా, కుటుంబ సభ్యుల్లా లేదా నమ్మకమైన వ్యక్తుల్లా కనిపించే కొందరు, ఆ నమ్మకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం చూస్తుంటాం.
సినిమా నేరుగా ఈ విషయాల గురించి మాట్లాడకపోయినా, బేర్ పాత్ర ద్వారా అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలపై హెచ్చరిక చేసినట్లు అనిపిస్తుంది. నిక్కీ తనను ఆ కోణంలో చూడదని తెలిసినా, ఆమె భావాలను మార్చాలని ప్రయత్నించడం ద్వారా వ్యక్తిగత కోరికల కోసం ఒకరి స్వేచ్ఛను ఎలా దెబ్బతీయవచ్చో చూపించింది.
Third Message: ప్రేమే రాక్షసిగా మారితే...
ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన సందేశం ప్రేమ గురించి ఇచ్చారని చెప్పవచ్చు.
సాధారణంగా హారర్ సినిమాల్లో భూతాలు లేదా దెయ్యాలు ప్రేక్షకులను భయపెడతాయి. కానీ అబ్సెషన్లో మాత్రం ప్రేమే భయంకరమైన అంశంగా మారుతుంది.
ప్రేమ అనేది అందమైన భావన. అది మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. కానీ అదే ప్రేమ హద్దులు దాటితే ప్రమాదకరంగా మారవచ్చు.
నిక్కీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మొదట సాధారణ ప్రేమగా మొదలైన భావన క్రమంగా అబ్సెషన్‌గా మారుతుంది. ప్రేమ కంటే స్వాధీనం చేసుకోవాలనే కోరిక ఎక్కువవుతుంది. ఆ తర్వాత ఆమె ఆలోచనలు, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. ఈ మార్పు ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సినిమాలో కనిపించే రాక్షసుడు ఎవరూ కాదు. నియంత్రణ కోల్పోయిన ఒక భావోద్వేగమే. అలానే ఒక మనిషిపై ఉన్న పిచ్చి ప్రేమ.
ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో అర్థం..!
ఈ సినిమా గొప్పతనం కూడా ఇక్కడే ఉంది. కొందరు బేర్‌ను విలన్‌గా చూస్తారు. మరికొందరు నిక్కీని బాధితురాలిగా చూస్తారు. ఇంకొందరు దీన్ని కేవలం ఒక హారర్ థ్రిల్లర్‌గా ఆస్వాదిస్తారు. సరైన అర్థం ఇదే అని చెప్పలేం. ఒక్కో ప్రేక్షకుడు తన అనుభవాలు, ఆలోచనల ఆధారంగా కథను అర్థం చేసుకుంటాడు.
అందుకే అబ్సెషన్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. కథ సింపుల్‌గా ఉన్నా, దాని వెనుక ఉన్న భావాలు మాత్రం చాలా లోతుగా ఉంటాయి. ప్రేమ, బాధ్యత, నమ్మకం, బంధాల హద్దులు, అబ్సెషన్ వంటి అంశాల గురించి ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
చివరికి అబ్సెషన్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రేమ అందంగా ఉంటుంది. కానీ అది ఆలోచన కోల్పోయినప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. కొన్నిసార్లు చీకట్లో దాగి ఉన్న దెయ్యాల కంటే నియంత్రణ కోల్పోయిన భావోద్వేగాలే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ సినిమా కేవలం హారర్ కథగా కాకుండా, ప్రేమ, బాధ్యత, భావోద్వేగాలు, సంబంధాల గురించి లోతుగా ఆలోచింపజేసే చిత్రంగా నిలిచిపోయింది.