రెండేళ్ల‌గా సైలెంట్ గా ఉన్న సింగం!

తమిళ చలనచిత్ర పరిశ్రమలో మాస్, హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు హరి.

Update: 2026-09-03 22:30 GMT

తమిళ చలనచిత్ర పరిశ్రమలో మాస్, హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు హరి. వేగ వంతమైన స్క్రీన్‌ప్లే, పవర్‌ఫుల్ డైలాగులు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో సౌత్ ఇండియానే ఊపేసిన ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా సూర్యతో ఆయన తెరకెక్కించిన `సింగం` ఫ్రాంచైజ్ సృష్టించిన ప్రభంజనం అలాంటి లాంటిది కాదు. అలాంటి మాస్ డైరెక్టర్ గత రెండేళ్లుగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించకపోవడం సినీ వర్గాల్లోనూ - ఆయన అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

విశాల్ కథానాయకుడిగా తెరకెక్కిన `రత్నం` చిత్రం తర్వాత హరి నుంచి ఎలాంటి కొత్త సినిమా ప్రకటన రాలేదు. సాధారణంగా ఒక సినిమా పూర్తి కాకముందే తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టే అలవాటున్న హరి ఇన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉండటం అరుదైన విషయమే. దీంతో `సింగం` కాంబినేషన్‌ను, ఆయన మార్కు స్పీడ్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే మాస్ అభిమానులు హ‌రి తదుపరి అడుగు ఎటువైపు ఉండబోతోందా? అని సామాజిక మాధ్యమాల్లో కారణాలు వెతుకుతున్నారు.

అయితే హరి వేగం తగ్గించడానికి కార‌ణం మారుతున్న ప్రేక్షకుల అభిరుచులేన‌ని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఫాస్ట్ పేస్డ్ మాస్ టెంప్లేట్ ఫార్ములా ఇప్పుడు ప్రాబల్యం కోల్పోయింది. నేటి తరం ప్రేక్షకులు లాజిక్ లేని యాక్షన్ సన్నివేశాల కంటే బలమైన కథాంశం, కొత్తదనంతో కూడిన ప్రపంచం , బలమైన పాత్రల చిత్రణను కోరుకుంటున్నారు. ఈ కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా తన మేకింగ్ శైలిని, స్క్రిప్ట్ సెలెక్షన్‌ను రీ-డిజైన్ చేసుకునే పనిలోనే హరి సమయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

అలాగే ప్రసుతం తమిళ పరిశ్రమలో టాప్ స్టార్లందరూ పాన్-ఇండియా రేంజ్ ప్రాజెక్టులతో సరికొత్త కాంబినేషన్లలో బిజీగా ఉన్నారు. హరి వంటి మాస్ దర్శకుడితో సినిమా చేయాలంటే? సరైన హీరో కాల్ షీట్స్ దొరకడం, భారీ బడ్జెట్ ప్రణాళికలు కుదరడం కూడా సవాలుగా మారుతోంది. గతంలో తాను చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ఈసారి కచ్చితంగా పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతోనే హ‌రి కూడా తొందరపడకుండా సరైన కథ కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు కోలీవుడ్ వర్గాల ప్రకారం హరి ఓ భారీ యాక్షన్ డ్రామా కథను ఇప్పటికే సిద్ధం చేశారని ఓ అగ్ర కథానాయకుడితో చర్చలు కూడా జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈసారి ఆయన తీయబోయే చిత్రం తమిళ రంగానికే పరిమితం కాకుండా పాన్-ఇండియా స్థాయిలో మెప్పించేలా సరికొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్యాప్ తర్వాత రాబోయే ప్రాజెక్ట్ హరి మార్కు మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఆధునిక సినీ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏదేమైనా రెండేళ్లపాటు కనిపించకపోయినా మాస్ సినిమాలకు హరి అందించిన ప్రాధాన్యతను ప్రేక్షకులు మర్చిపోలేరు. `సింగం` లాంటి సునామీని సృష్టించిన మాస్ డైరెక్టర్ తదుపరి చిత్రంతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి. త్వరలోనే హ‌రి నుంచి రాబోయే అధికారిక ప్రకటన కోసం కోలీవుడ్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News