హీరో దిలీప్ కు బిగ్ రిలీఫ్.. హీరోయిన్ కిడ్నప్ కేసులో సంచలన తీర్పు
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన 2017 నాటి నటిపై దాడి కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది.;
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన 2017 నాటి నటిపై దాడి కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. మలయాళ స్టార్ హీరో దిలీప్ కు ఈ కేసులో భారీ ఊరట లభించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో, ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఈ కేసు విచారణ మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. 2017లో ఒక ప్రముఖ నటిని కారులో కిడ్నాప్ చేసి, అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేరానికి కుట్ర పన్నారనే అభియోగంపై దిలీప్ ను 8వ నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆయనకు ఇప్పుడు క్లీన్ చిట్ లభించింది.
అయితే కోర్టు తీర్పులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. దిలీప్ ను నిర్దోషిగా వదిలేసినా, ఈ ఘోరానికి పాల్పడిన అసలైన వ్యక్తులను మాత్రం దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితుడు పల్సర్ సునీతో పాటు మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజేష్, సలీం వంటి మరో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద నేరాలు రుజువయ్యాయి.
దోషులుగా తేలిన ఈ ఆరుగురికి ఎలాంటి శిక్ష విధిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు వీరి శిక్షల వివరాలను డిసెంబర్ 12న ప్రకటించనుంది. దిలీప్ పై కుట్ర ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆయన పై ఉన్న అన్ని కేసులను కొట్టివేశారు. ఈ కేసు చరిత్ర చూస్తే చాలా సంక్లిష్టంగా సాగింది. విచారణలో భాగంగా ఏకంగా 261 మంది సాక్షులను కోర్టు విచారించింది. అందులో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
విచిత్రం ఏంటంటే.. విచారణ సమయంలో 28 మంది సాక్షులు ప్లేట్ ఫిరాయించారు. ప్రాసిక్యూషన్ తరఫున 800కు పైగా పత్రాలను సమర్పించారు. మొత్తానికి 438 రోజుల పాటు సాగిన సాక్షుల విచారణ, న్యాయవాదుల వాదనల తర్వాత ఈ రోజు తీర్పు వచ్చింది. దిలీప్ కు విముక్తి లభించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ అసలు బాధితురాలికి న్యాయం జరిగిందా లేదా అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 12న దోషులకు పడే శిక్షను బట్టి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.