అనిల్ మరీ ఇంత ఫాస్టా..
భోళా శంకర్ సినిమా తర్వాత ఎంతో ఆలోచించి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో రెండు సినిమాలున్నాయి.;

భోళా శంకర్ సినిమా తర్వాత ఎంతో ఆలోచించి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి విశ్వంభర కాగా రెండోది మెగా157. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న చిరంజీవి ఆ సినిమా షూటింగ్ ను ఆల్మోస్ట్ పూర్తి చేశాడు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన ఫోకస్ మొత్తం హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో చేస్తున్న మెగా157 సినిమాపైనే పెట్టాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఉగాది రోజున పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రీసెంట్ గానే సెట్స్ పైకి వెళ్లింది. మొదటి షెడ్యూల్ లో చిరంజీవి, నయనతార ఇద్దరూ పాల్గొన్నారు.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో చిరూ, నయన్ పై కామెడీ సీన్స్ ను అనిల్ షూట్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా ఇప్పుడు ఈ షెడ్యూల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. రీసెంట్ గానే మొదలుపెట్టిన మెగా157 ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే పూర్తైందని తెలుస్తోంది. అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే అనిల్ దాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
షూటింగ్ కు వెళ్లడానికి ముందే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వల్లే అనిల్ ఈ షెడ్యూల్ ను ఇంత త్వరగా పూర్తి చేశాడని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయడమే కాకుండా రెండో షెడ్యూల్ కు రంగాన్ని కూడా సిద్ధం చేశాడట అనిల్. చూస్తుంటే అనిల్ మెగా157ను తన కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తి చేసిన సినిమాగా నిలిపేలా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో చిరూని అనిల్ వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కేవలం లుక్ మాత్రమే కాకుండా చిరూ గతంలో చేసిన కామెడీని కూడా ఈ సినిమాలో అనిల్ చేయించనున్నాడట. చాలా కాలంగా చిరంజీవి నుంచి ఫ్యాన్స్ మిస్ అవుతున్న కామెడీ యాంగిల్ ను వాడుకుని మెగాస్టార్ ను సరికొత్తగా చూపించబోతున్నాడని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలబెట్టడానికి అనిల్ తన వంతుగా చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.