రిలీజైన పదేళ్ల తర్వాత స్పానిష్ భాషలోకి
ఇప్పుడు `బాహుబలి: ది బిగినింగ్` స్పానిష్-డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.;
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన `బాహుబలి: ది బిగినింగ్` దక్షిణ భారత సినిమాను దేశవ్యాప్తంగా ప్రజలు చూసే విధానాన్ని మార్చడమే కాకుండా, సౌత్ నుండి వచ్చే ప్రతిష్టాత్మక చిత్రాలకు ప్రపంచవ్యాప్త మార్కెట్ కు మార్గం సుగమం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సౌత్ వెలిగిపోయేలా చేసిన సినిమా ఇది.మొదటి భాగం 2015లో విడుదలైంది. ఇది భారతీయ సినిమాను శాశ్వతంగా మార్చేసిన ఘనతను అందుకుంది. అసలు పాన్ ఇండియా అనే పదం బలంగా వేళ్లూనుకున్నది ఈ సినిమా రిలీజ్ తర్వాతే. అంతకుముందు చాలా పాన్ ఇండియన్ సినిమాలు వచ్చినా వాటికి ఈ స్థాయి ప్రచారం లేదు. ఇరుగు పొరుగున కలెక్షన్లలో ఈ స్థాయి ప్రభంజనం సృష్టించలేదు. బాహుబలి చిత్రం భారతదేశం, అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ లాంటి చోట్ల రిలీజ్ చేయగా గొప్ప ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన చాలా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి.
ఇప్పుడు `బాహుబలి: ది బిగినింగ్` స్పానిష్-డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 10 సంవత్సరాల తర్వాత మరో కొత్త భాషలోను విడుదలవుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఇంతకాలం తర్వాత, నెట్‌ఫ్లిక్స్ అకస్మాత్తుగా స్పానిష్-డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకోవడానికి కారణమేమిటీ?
యూరోపియన్ మార్కెట్‌లో దక్షిణ భారత సినిమా పరిధిని విస్తరించాలనే ఆలోచన దీని వెనక పని చేస్తోందా? నెట్‌ఫ్లిక్స్ యూరోపియన్ ప్రేక్షకులకు అత్యంత అందుబాటులో ఉన్న OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఇప్పుడు తెలుగు సినిమాని నెమ్మదిగా యూరోపియన్లకు ఎక్కించే ప్రయత్నం చేస్తోందా? దీనిని అద్భుతంగా ప్రారంభించడానికి బాహుబలి: ది బిగినింగ్ కంటే మంచి మార్గం మరొకటి లేదని భావించి ఉండాలి. ఈ ఎపిక్ బ్లాక్‌బస్టర్ భారతీయ సినిమాను రీడిఫైన్ చేసింది. థియేటర్ల నుంచి దాదాపు 650 కోట్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి 1 స్పానిష్ లో ఎలాంటి ఆదరణ దక్కించుకుంది? అన్నదానిని బట్టి తదుపరి బాహుబలి ది కన్ క్లూజన్ సహా చాలా ప్రభాస్ సినిమాలను నెట్ ఫ్లిక్స్ స్పానిష్ లోకి డబ్ చేసి విడుదల చేసేందుకు అవకాశం ఉంది. కేవలం స్పానిష్ మాత్రమే కాదు, ఇతర యూరోపియన్ భాషలలో కూడా ఆజానుబాహుడైన ప్రభాస్ సినిమాలను విడుదల చేయడానికి ప్రేరేపించే వీలుంది.
అయితే స్పానిష్-డబ్బింగ్ వెర్షన్ `బాహుబలి: ది బిగినింగ్` 2 గంటల 17 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. హిందీ, తెలుగు వెర్షన్‌లకు 2 గంటల 38 నిమిషాలు, తమిళ వెర్షన్‌కు 2 గంటల 39 నిమిషాలు నిడివి ఉంది. స్పానిష్ వెర్షన్ లో చాలా వరకూ కట్స్ చెబుతారని కూడా భావిస్తున్నారు.