ఇలాంటి క్రూరలోకంలో బతుకుతున్నాం: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-09-14 12:30 GMT
హైదరాబాద్ లోని సైదాబాద్ లో గల సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణాన్ని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి గురైన ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ దారుణానికి పాల్పడిన దుండగుడిని పోలీసులు ఇంతవరకూ పట్టుకోలేకపోయారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులను సినీ నటుడు మంచు మనోజ్ ఇవాళ పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ఆరేళ్ల బాలికపై ఇలాంటి దారుణానికి పాల్పడడం క్రూరమైన చర్య అని వాపోయారు. సభ్య సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు, గురువులు నేర్పించాలని చెప్పారు.

నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు చెబుతుండడం దారుణమని మనోజ్ ఆక్షేపించారు. ఈ ఘాతుకానికి కారణమైన నీచుడిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఇలాంటి రాక్షసులకు 24 గంటల్లో ఉరిశిక్ష విధించాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాపలేని లోటును తీర్చలేమన్నా మనోజ్.. ఆ కుటుంబానికైనా అండగా ఉందామని కోరారు. మగవాడి ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.
Tags:    

Similar News