మన స్టార్ రైటర్ తో రజినీకాంత్?

Update: 2015-08-05 09:37 GMT
విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. వారం వ్యవధిలో బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన రచయిత ఆయన. విజయేంద్ర ప్రసాద్ రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు కానీ.. ఆయనదెప్పుడూ లో ప్రొఫైలే. బాహుబలి కంటే ముందే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు కథ అందించినా.. ఆయనకు అంతగా పేరు రాలేదు. క్రెడిట్ మొత్తం కొడుక్కే వెళ్లిపోయింది. ఐతే బాహుబలి, భజరంగి భాయిజాన్ వారం వ్యవధిలో విడుదలై ఆయన గురించి దేశమంతా చర్చించుకునేలా చేశాయి. పెద్దగా మీడియాలో కనిపించని విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు మాత్రం బాగానే ఇంటర్వ్యూలిచ్చారు. తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఏ సినిమాకు కథ అందించబోతున్నారన్న ఆసక్తి అందర్లోనూ మొదలైంది.

ఐతే ప్రస్తుతానికి రాజమౌళితో ఆయనకు పెద్దగా పని లేదు. బాహుబలి-2కు సంబంధించి రచన ఎప్పుడో పూర్తయింది. దీంతో వేరే కథల మీద దృష్టిపెట్టారు పెద్దాయన. ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఓ కథ తయారు చేసినట్లు సమాచారం. ఇటీవలే ఓ ఫంక్షన్ లో రజినీని కలిసినపుడు కథ కూడా వినిపించారట. రాజకీయ నేపథ్యంలో ఉండే ఆ కథ రజినీకి నచ్చిందని కూడా అంటున్నారు. ఐతే ఈ  సినిమాకు ఎవరన్నదానిపై క్లారిటీ లేదు. కుదిరితే తనే డైరెక్షన్ చేయాలని కూడా విజయేంద్ర ప్రసాద్ భావిస్తున్నారట. ఆయనకు డైరెక్షన్ మీద బాగానే కోరిక ఉంది. ఇంతకుముందు శ్రీకృష్ణ 2006, రాజన్న సినిమాలకు దర్శకత్వం వహించారాయన. ఐతే విజయేంద్ర కథకు ఓకే అనొచ్చు కానీ.. డైరెక్షన్ కు రజినీ ఒప్పుకుంటాడా అన్నది సందేహం. ప్రస్తుతం రంజిత్ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రజినీ.. దీని తర్వాత శంకర్ దర్శకత్వంలో రోబో-2 చేస్తాడు. అదయ్యాక విజయేంద్ర కథ తెరమీదికి రావచ్చు.
Tags:    

Similar News