లవ్ టుడే: మారుతి ఎప్పుడో టచ్ చేసాడు.. కొత్తదనం ఏముంది..?

Update: 2022-11-17 07:53 GMT
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల సందడి కనిపిస్తుండటంతో.. స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం ఇతర భాషల్లో హిట్టైన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చెయ్యడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ''లవ్ టుడే'' అనే తమిళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

"లవ్ టుడే" అనేది ఇటీవల కోలీవుడ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచినా చిన్న సినిమా. 'కోమలి' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ - రాధికా శరత్ కుమార్ - యోగిబాబు - రవీనా రవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'లవ్ టుడే' చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ పై తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ లోకి వెళ్తే.. ప్రేమలో ఉన్న హీరోహీరోయిన్లు ప్రదీప్ - ఇవానా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించాలనుకుంటారు. హీరో సైడ్ ఎలాంటి సమస్య లేనప్పటికీ, కథానాయిక తండ్రి (సత్యరాజ్) ఈ జంటకు ఒక పరీక్ష పెట్టాడు. ఒకరోజు ఒకరికొకరు ఫోన్లు మార్చుకొని మరుసటి రోజు పెళ్ళికి ఓకే అంటే తనకు డబుల్ ఓకే అని చెప్తాడు.

ఒకరి ఫోన్లు ఒకరు మార్చుకున్న తర్వాత ప్రదీప్ మరియు ఇవానా మధ్య ఏర్పడే సమస్యలు.. దాని చుట్టూ జెనెరేట్ అయ్యే కామెడీని ప్రధానంగా చూపించారు. ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. స్టోరీ కాన్సెప్ట్ వరకు బాగానే ఉన్నప్పటికీ.. ట్రైలర్ లో తమిళ వాసన ఎక్కువగా కనిపిస్తోంది.

తమిళ నటీనటుల 'అతి' మరియు డైలాగ్స్ లిప్ సింక్ కుదరకపోవడంతో తెలుగు సినిమా అనే ఫీలింగ్ రాకుండా చేస్తున్నాయి. ఇదంతా తమిళ సెన్సిబిలిటీస్ కి దగ్గరగా.. అక్కడి జనాలను ఆకట్టునే విధంగా ఉంది. అందులోనూ మారుతి లాంటి దర్శకులు తెలుగులో ఇలాంటి న్యూ ఏజ్ లవ్ కాన్సెప్ట్స్ ను ఎప్పుడో టచ్ చేసారు.

అయితే ట్రైలర్ చూసిన తర్వాత "లవ్ టుడే" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. టాలీవుడ్ యాక్టర్స్ ని పెట్టి, మారుతి లాంటి ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడితో రీమేక్ చేస్తే ఒక రేంజ్ లో వెళ్లొచ్చనే భావన కలుగుతోంది. కానీ ఇప్పటికప్పుడు డబ్ చేసి, ప్రమోషన్స్ ఏమీ లేకుండా రిలీజ్ చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ తక్కువే అనిపిస్తుంది.

'లవ్ టుడే' చిత్రాన్ని నవంబర్‌ లోనే విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ట్రైలర్‌ లో కంఫర్మ్ చేసారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై రూపొందిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. తమిళ్ లో హిట్టైన ఈ సినిమా.. తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News