కంగనాపై రైటర్ సంచలన ఆరోపణలు

Update: 2017-05-18 06:37 GMT
కంగనా రనౌత్ మంచి నటే. సందేహం లేదు. కానీ ఎప్పుడూ ఆమె చుట్టూ ఏదో ఒక వివాదం ముసురుకుంటూనే ఉంటుంది. కంగనా ఎవరినో ఒకరిని తిట్టడం.. ఆరోపణలు గుప్పించడం కామన్. ఏదైనా ఓపెన్‌ గా మాట్లాడేసే కంగనా.. మిగతా హీరోయిన్లకు భిన్నంగా తెర వెనుక సంగతుల్ని బయటపెట్టేస్తుంటుంది. హీరోలు.. దర్శకులు చాలామందిని తన ఓపెన్ టాక్ తో ఇబ్బంది పెట్టింది కంగనా. ఐతే ఇప్పుడు ఆమెనే ఇబ్బందుల్లోకి నెట్టే తెర వెనుక విషయం ఒకటి బయటికి వచ్చింది. కంగనా తన కష్టాన్ని తన క్రెడిట్ గా చెప్పుకుని.. పేరు కొట్టేసే ప్రయత్నంలో ఉందంటూ రైటర్ అపూర్వ అస్రాని ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు.

ఇటీవలే కంగనా రనౌత్ కొత్త సినిమా ‘సిమ్రన్’ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. సరదాగా సాగిన ఈ టీజర్ చూసి ‘సిమ్రన్’ కంగనాకు మరో ‘క్వీన్’ అవుతుందని అంటున్నారు జనాలు. ఐతే ఈ సినిమా టైటిల్స్‌లో అడిషనల్ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ క్రెడిట్ కంగనాకు ఇవ్వడంపై రైటర్ అపూర్వ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. స్క్రిప్టు రాసింది తానైతే.. తన పేరు కంటే ముందు ఆమె పేరును ఎలా వేస్తారంటూ అతను ప్రశ్నించాడు.

తాను ‘సిమ్రన్’ కోసం 9 డ్రాఫ్ట్స్ రాశానని.. చివరికి ఫైనల్ వెర్షన్ రెడీ చేసి కంగనాకు స్క్రిప్టు వినిపిస్తే.. ఆమె ఎగిరి గంతేసినంత పని చేసిందని.. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆన్ సెట్స్ కొన్ని ఇంప్రొవైజేషన్స్ జరిగిన మాట వాస్తవమని.. దాని గురించి తెలిసి తాను కూడా సంతోషించానని.. కానీ ఈ మాత్రానికే అడిషనల్ స్క్రీన్ ప్లే... డైలాగ్స్ క్రెడిట్ ఇవ్వడం.. తన పేరు కంటే ముందు ఆమె పేరు వేయడం ఏమిటని అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ సినిమా ప్రమోషన్లలో కూడా దర్శకుడు హన్సల్ మెహతాతో కలిసి తానే స్క్రిప్టు రాసినట్లుగా కంగనా చెప్పుకుంటోందని.. ఇది తన కష్టాన్ని దోచుకోవడమే అని అతను అన్నాడు. కొన్నాళ్ల నుంచి ఈ మోసాన్ని మౌనంగా భరిస్తూ వచ్చానని.. ఇక ఆగలేక ఇలా ఓపెన్ అవుతున్నానని తన ఫేస్ బుక్ పోస్టులో అపూర్వ తెలిపాడు. మరి ఈ ఆరోపణలపై కంగనా అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News