ప్రకాశ్ రాజ్ ఇంట్లో ఐటీ దాడుల తర్వాత ఏమైంది?

Update: 2022-07-18 00:30 GMT
ఒక సినీ నటుడు సినిమా విషయాలే కాదు సామాజిక అంశాల మీద మాట్లాడటం కాస్త తక్కువ. అందునా అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పటం మరింత తక్కువ. ఇక.. నరేంద్ర మోడీ లాంటి ప్రజాదరణ ఉన్న ప్రధాని మీద ఘాటు వ్యాఖ్యలతో పాటు.. జస్క్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలు సంధించటం అందరికి సాధ్యం కాదు. అలాంటి దమ్ము.. ధైర్యం.. తెగింపు ఉన్న నటుల్లో ఒకరు ప్రకాశ్ రాజ్. తాను వామపక్ష వాదిని కాదనే ఆయన్ను వామపక్ష వాదులు మాత్రం తమ వాడిగా భావిస్తాయి.

అదే సమయంలో రైటిస్టు ఆయన్ను తమ వాడిని కాదనే అంటుంటాయి. ఇక.. హిందుత్వ వాదులు.. అతడో పక్కా హిందూ విరోధిగా అభివర్ణిస్తారు. ఇంతకూ మీరేంటి? అని ప్రకాశ్ రాజ్ నే ప్రశ్నిస్తే.. నేను రైటిస్ట్ కాదు లెఫ్టిస్ట్ కాదు సెంట్రిస్టు కాదు.. నేనొక మనిషిని అని స్పష్టం చేశారు. సినిమాలతో పాటు తన మనసుకు నచ్చిన.. నచ్చని విషయాల్ని ఉన్నవి ఉన్నట్లుగా మాట్లాడినందుకు తనపై జరుగుతున్న తనిఖీలను ప్రస్తావించటంత పాటు.. తనను అదే పనిగా బెదిరించే వారి గురించి ఆయన చెబుతుంటారు.

తాను నిజాయితీగా వ్యవహరిస్తానని.. ఏడాదికి రూ.కోటి ఆదాయపన్ను చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. అలాంటి ఆయనపై ఈ మధ్యన ఐటీ దాడులు జరిగాయి. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు.. 'ఐటీ దాడులు చేసి ఏం పట్టుకున్నారు? బినామీ ఆస్తులు ఏమైనా దొరికాయా? హనీ ట్రాపులు వేస్తారా? అలాంటి అలవాట్లు నాకు లేవు కాబట్టి దొరకను. ఇంకేం చేయాలి. వంద కేసుల్లో లోపల వేసే అవకాశం ఉంది. కానీ అలా వేయలేకపోతున్నారంటే నిజాయితీగా బతుకుతున్నాననేగా అర్థం' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి.. నీ అంతు చూస్తాం.. నువ్వు పోతావురా అంటారా. వాళ్లకు ఇవేం ఆనందమో అర్థం కాదన్నారు. 'నా సినిమాలు చూడమన్నారు. అయినా నా సినిమాలు ఆడుతున్నాయి. మోడీ మీద సినిమా తీస్తే ఇండియా మొత్తం మీదా రూ.30 కోట్ల వసూళ్లు రాలేదు. దీపికా పడుకోన్ సినిమా నిషేధించారు. రూ.500 కోట్లు వసూలు చేసింది' అంటూ మోడీ పరివారానికి కాలే మరో వ్యాఖ్యను చేశారు.
Tags:    

Similar News