పెద్ద సినిమాలు రిలీజ్ కావాలంటే ఆ సమస్యలు పరిష్కారం కావాల్సిందేనా..?

Update: 2020-12-14 13:30 GMT
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు ఓపెన్‌ చేసుకోడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు మల్టీప్లెక్సులు థియేటర్లు ఓపెన్‌ చేసి పాత సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని క్రేజీ మూవీస్ కూడా క్రిష్మస్ మరియు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో త్వరలో సినిమా సందడి ప్రారంభం కానుందని అందరూ అనుకున్నారు. అయితే ఇదే సమయంలో థియేటర్స్ పూర్తి స్థాయిలో రీ ఓపెన్ చేయకపోడానికి పెద్ద నిర్మాతలే కారణమని టాక్ నడుస్తోంది. ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కావాలనే కొంత మంది సినీ పెద్దలు థియేటర్లను తెరవనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య ఇప్పటివరకు ఉన్న ఒప్పందాలను పక్కన పెట్టి కొత్త రెవెన్యూ షేరింగ్ విధానాన్ని తీసుకురావాలని.. VPF చార్జీలు కూడా థియేటర్ల యజమానులే భరించాలని నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే టిక్కెట్‌ మీద వస్తున్న మెయింటనెన్స్ ఛార్జీల్లో కూడా నిర్మాతలు షేర్‌ అడుగుతున్నారట. ఆన్‌ లైన్‌ టికెట్‌ మీద అయితే 7 రూపాయలు సాధారణ టికెట్‌ అయితే 3 రూపాయల మెయింటనెన్స్ చార్జీ కావాలని అడుగుతున్నారట. అయితే రూపాయికి మించి ఇవ్వడం కుదరదని థియేటర్ల ఓనర్స్ చెబుతున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ షేరింగ్ ప్రకారమే మల్టీప్లెక్స్ ల మనుగడ కష్టంగా ఉంది.. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ షేర్ పెంచటం సాధ్యంకాదని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమస్యలకి పరిష్కారం లభించినాకే పెద్ద సినిమాల విడుదల ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News