వెంకీ.. డాలీ.. ఓ పోలీస్ కథ

Update: 2015-10-25 04:01 GMT
విక్టరీ వెంకటేష్ చివరి సినిమా ‘గోపాల గోపాల’ విడుదలై పది నెలలవుతోంది. ఇప్పటిదాకా ఆయన తర్వాతి సినిమా మొదలు కాలేదు. అసలు వెంకీ తర్వాత ఏ సినిమా చేస్తాడన్న సంగతీ తేలడం లేదు. ‘‘జూన్ నెలలో ఒకేసారి రెండు సినిమాలు మొదలుపెడతా’’ అని మేలో చెప్పిన వెంకీ.. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఈ మధ్యలో వెంకీ సినిమాలకు సంబంధించి చాలా వార్తలు వినిపించాయి కానీ.. ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఐతే ఈ మధ్య మారుతి - క్రాంతి మాధవ్‌ లతో వెంకీ చేయబోయే సినిమాల గురించి కాస్త గట్టిగానే కబుర్లు వినిపిస్తున్నాయి.

ఐతే వాటి సంగతేమో కానీ.. వెంకీ త్వరలో ఓ పోలీస్ కథలో నటిస్తాడని.. ఆ సినిమాకు ‘గోపాల గోపాల’ ఫేమ్ కిషోర్ పార్థసాని అలియాస్ డాలీ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇంకో ఆసక్తికర విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు కథ అందిస్తోంది వక్కంతం వంశీ అట. ‘కిక్-2’ తర్వాత సురేందర్ రెడ్డికి టాటా చెప్పేసిన వక్కంతం.. సొంతంగా దర్శకుడు కావడానికి ప్రయత్నాలు చేశాడు. ఎన్టీఆర్‌ తో సినిమా కూడా ఓకే అయింది. దీంతో ఇక వక్కంతం నుంచి బయటి వాళ్లకు కథలేమీ రావనుకున్నారు. ఐతే అతను వెంకీ కోసం కథ రాసి డాలీకి ఇచ్చాడట. వక్కంతం ఎన్టీఆర్‌ కు ఇచ్చిన ‘టెంపర్’ కూడా పోలీస్ కథే అన్న సంగతి తెలిసిందే. వెంకీ చివరగా ‘ఘర్షణ’ సినిమాలో పోలీస్‌ గా కనిపించాడు.
Tags:    

Similar News