దిల్ రాజుది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా?

Update: 2017-10-17 10:31 GMT
దిల్ రాజు తన సినిమాల గురించి ఎప్పుడూ మరీ ఎక్కువ చేసి చెప్పడు. సినిమా సక్సెస్ అయ్యేలా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ మాత్రం ఆయన మాటల్లో కనిపిస్తుంటుంది. గతంలో రాజు ఇలా నమ్మకంగా చెప్పిన సినిమాల్లో చాలా వరకు ఆడాయి. చివరగా ‘ఫిదా’ విషయంలోనూ ఆయన సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు తన బేనర్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’ విషయంలోనూ ఆయన చాలా చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. ఇంతకుముందు ఆడియో వేడుకలో.. ఈ మధ్య ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజు కాన్ఫిడెన్స్ చూసి చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఈ సినిమాతో సిక్సర్ కొట్టబోతున్నామని.. రవితేజ కెరీర్లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని తీర్మానించేశాడు రాజు.

మరి రాజుది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకొక్క రోజులో ‘రాజా ది గ్రేట్’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీపావళి సీజన్లో వస్తున్న సినిమా కావడం.. పాజిటివ్ బజ్ ఉండటంతో ‘రాజా ది గ్రేట్’ను రవితేజ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయంలోనూ రాజు కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. రవితేజ కెరీర్ కు ఈ సినిమా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు వరుస ఫ్లాపులు.. మరోవైపు రెండేళ్ల గ్యాప్.. రవితేజ మార్కెట్ ను దెబ్బ తీశాయి. ఈ సినిమా హిట్టయితే రవితేజ మళ్లీ ఊపందుకుంటాడు. మరోవైపు ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకుడు అనిల్ రావిపూడి.. హీరోయిన్ మెహ్రీన్ హ్యాట్రిక్స్ పూర్తి చేస్తారు. ఈ ఏడాది దిల్ రాజు జైత్రయాత్ర కూడా కొనసాగినట్లవుతుంది. మరి ‘రాజా ది గ్రేట్’ ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూద్దాం.
Tags:    

Similar News