మెగాస్టార్ క‌థంతా చెప్పేశారు

Update: 2018-12-28 04:41 GMT
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించే సినిమాల క‌థ‌ల‌న్నీ మెగాస్టార్ లీక్ చేసేస్తున్నారా? అంటే అవున‌నే ప్ర‌తిసారీ ఆడియో వేదిక‌లు నిరూపిస్తున్నాయి. ఈసారి కూడా `విన‌య విధేయ రామ‌` క‌థ‌ను  అన్న‌య్య లీక్ చేసేశారు. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కి వ‌స్తున్న ఈ సినిమా క‌థ‌పై నిన్న సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌లో ఇదీ క‌థ అంటూ లీకు ఇచ్చేశారు చిరు.

ఆయ‌న‌కు ఇప్పుడే కొత్తేమీ కాదు.. ఇదివ‌ర‌కూ `రంగ‌స్థ‌లం` ఆడియో వేదిక‌పైనా ఆ సినిమా క‌థ‌పై లీకులిచ్చారు. అందులో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ పైనా - ఆది పాత్ర‌ను పొగిడేస్తూ త‌న పాత్ర ఇదీ అని చెప్పేశారు. దాంతో చ‌ర‌ణ్- ఆది అన్న‌ద‌మ్ములుగా న‌టించార‌న్న క్లారిటీ చాలా ముందే వ‌చ్చేసింది అభిమానుల‌కు. అయితే ఆయ‌న ఇచ్చిన లీకు ఆ త‌ర్వాత సినిమాకి క‌లిసొచ్చిందే కానీ మైన‌స్ కాలేదు.

మ‌రోసారి `విన‌య విధేయ రామ` క‌థ గురించి చిరు లీకులిచ్చేశారు. కుటుంబాన్ని కాపాడుకునే హీరోగా చ‌ర‌ణ్ క‌నిపిస్తాడ‌ని చిరు ఓపెన్‌గా చెప్పేశారు. ``రామ్ కొణిదెల...` అనే డైలాగ్ ని చిరు త‌న‌దైన శైలిలో వేదిక‌పై చెప్ప‌డం అభిమానుల‌కు సూటిగా తాకింది. కుటుంబం కోసం ఎంత‌కైనా తెగించే క‌థానాయ‌కుడి క‌థ ఇదీ అని చిరు చెప్ప‌క‌నే చెప్పారు. ట్రైల‌ర్ లో చ‌ర‌ణ్ చెప్పిన భారీ పంచ్ డైలాగ్ ని అన్న‌య్య త‌న నోట వినిపిస్తూ ఎగ్జ‌యిట్ అయిపోయారు. బోయ‌పాటి పూర్తి మాస్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తీశార‌ని చిరు పొగిడేశారు. ``రంగస్థలం షూటింగ్‌ సమయంలో చ‌ర‌ణ్‌ తదుపరి సినిమా ఏం చేస్తే బావుంటుందనేది చ‌ర్చించాను. మాస్ ను అలరించేలా ఫ్యాన్స్ కు కిక్‌ ఎక్కించేలా సినిమా చేయమని చెప్పాను. అప్పుడు అలాంటి లైన్ ను బోయపాటిగారి దగ్గర విన్నాన‌ని తను చెప్పాడు. పర్ ఫెక్ట్‌ కాంబినేషన్ .. త‌ప్ప‌కుండా మాస్‌ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నేను ప్రోత్సహించాను. అలా బోయపాటి లైన్‌ లోకి వచ్చారు. ఫ్యామిలీ ప్రొటెక్టర్ గా కథ వినగానే నాకు గ్యాంగ్‌ లీడర్‌ గుర్తుకొచ్చింది. నాకు చాలా ఇన్ స్పైరింగ్ గా అనిపించింది. సినిమా రషెష్‌ చూశాను. ఆకట్టుకుంది. మాస్ కు సంబంధించి చరణ్ ను హైట్స్ లో చూపించారు. చరణ్‌ డైలాగ్స్‌, ఫైట్స్‌ చక్కగా కుదిరాయి. ట్రైలర్ లోని డైలాగ్స్‌ చూసి శభాష్‌ అన్నాను. బోయపాటి తనతో అంత గొప్పగా చేయించాడు. దాన్ని చరణ్‌ తెరపై అంత బాగా చేశాడు..`` అంటూ పొగిడేశారు చిరు. ఇక ఈ సినిమాలో బుల్లెట్ కంటే బ్యాలెట్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ అని ప్రూవ్ చేద్దామంటూ ఎన్నిక‌ల అధికారిగా చ‌ర‌ణ్ సోద‌రుడు ప్ర‌శాంత్ క‌నిపించ‌నున్నారు. ట్రైల‌ర్ లో ఆ మేర‌కు డైలాగ్స్ సినిమా క‌థ‌ను రివీల్ చేసేశాయి.


Tags:    

Similar News